రాష్ట్రానికి ఏం చేయని నువ్వు దేశాన్ని బాగు చేస్తావా?

రాష్ట్రానికి ఏం చేయని నువ్వు దేశాన్ని బాగు చేస్తావా?

నల్గొండ: రాష్ట్రంలో ఏం సాధించారని ఇప్పుడు దేశాన్ని బాగు చేస్తానంటూ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారని ప్లీనరీ పేరుతో ఉత్సవాలు చేసుకుంటున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు. ప్లీనరీ పేరుతో వందల కోట్ల ప్రజా ధనాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు

ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ ద్వారా తన ఫాం హౌజ్ కు నీళ్లు తెచ్చుకున్నారే తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. నార్కట్ పల్లిలోని బ్రాహ్మణ వెళ్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లాకే కేసీఆర్ సీఎం అయినట్లు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్నా కేసీఆర్... ఇప్పటివరకు ఒక్కరికి కూడా రుణమాఫీ చేయలేదన్నారు. కేసీఆర్ హయాంలో విద్య, వైద్యం భ్రష్టుపట్టిందన్న ఆయన... నోటిఫికేషన్ల పేరుతో కేసీఆర్ హడావుడి చేస్తున్నారన్నారు. ధరణి పేరుతో రైతులను దోచుకున్నారని చెప్పిన ఆయన... తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణిని ఎత్తేస్తామని చెప్పారు. కౌలు రైతులకు వెంటనే రైతు బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు.పెట్రో ఛార్జీలు పెంచుతూ మోడీ, కేసీఆర్ ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారని, ధర్నాల పేరుతో ఒకరినొకరు దూషించుకుంటూ... కేసీఆర్, బీజేపీ నాయకులు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.