ఐటీ దాడులతో ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు: వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి బంధువుల ఇళ్లపై ఐటి దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.  బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని.. రెండు ఒక్కటేనని..  బీఆర్ఎస్ కు  ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని అన్నారు. మోదీ, కేసీఆర్ కలిసే.. కాంగ్రెస్ అభ్యర్థులపై ఐటి దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో.. 2023, నవంబర్ 9వ తేదీ గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  లక్షల కోట్ల రూపాయల దోచుకున్న అధికార పార్టీని వదిలి పెట్టి.. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై ఐటి దాడులు చేస్తూ భయపెట్టాలని చూస్తున్నారన్నారు. కల్వకుంట్ల కవితపైన ఈడి కేసులో సెల్ ఫోన్లు ద్వంసం చేసిన కూడా అరెస్ట్ చేయకుండా ఉన్నారంటే.. వారి లోపాయకారి ఒప్పందం అర్థమవుతోందన్నారు.

కాంగ్రెస్ నాయకులు చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి..  బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కొట్లాడేందుకు కలిసి రావాలన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం కోసం కాదని.. నాలుగు కోట్ల ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం రావాలని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో  కాంగ్రెస్ పార్టీ గెలవద్దని ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నారని అన్నారు వెంకట్ రెడ్డి.  కాంగ్రెస్ అభ్యర్థులను ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.  ముస్లింలను రెండు పార్టీలు దేశంలో ఒంటరిని చేశాయన్నారు.  కాంగ్రెస్ ముస్లిం డిక్లరేషన్ ప్రకటించబోతోందని... ముస్లింలు అందరూ కూడా కాంగ్రెస్ కు ఓటెయ్యాలని కోరారు. 

మిర్యాలగూడలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బిఎల్ఆర్ కన్ఫామ్ అయ్యారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చప్పారు. సూర్యాపేట, తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థులను అదిష్టానం సాయంత్రంలోపు కన్ఫామ్ చేయనున్నట్లు తెలిపారు. భువనగిరి గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరవేయడం కాయమని ధీమా వ్యక్తం చేశారు. సోనియాగాంధీ పుట్టిన రోజున కాంగ్రెస్ ను గెలిపించి బహుమతి ఇస్తామని వెంకట్ రెడ్డి అన్నారు.