బీఆర్ఎస్ ఎమ్మెల్యేలవన్నీ దందాలే

  • ఊరికి 5 గ్రూపులున్న బీఆర్ఎస్​ను ఓడిస్తం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 
  • 30% కమీషన్ల సర్కార్​ను గద్దె దించాలి: రేవంత్ 
  • రైతులు కన్నీళ్లు పెడ్తుంటే.. బీఆర్ఎస్ నేతలు 
  • తాగి చిందులు వేస్తున్నరని ఫైర్​  
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలవన్నీ దందాలే: ఉత్తమ్  
  • నల్గొండలో నిరుద్యోగ నిరసన ర్యాలీ 

నల్గొండ, వెలుగు: ‘‘మాలో ఎన్ని గ్రూపులు ఉన్నా కలిసిపోతం. చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నా అవసరమైనప్పుడు అందరం ఒక్కటవుతం. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొస్తం” అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ‘‘మాలో గ్రూపులు ఉన్నయని అంటున్రు. బీఆర్ఎస్ లో గ్రూపులు లేవా? ఊరికి ఐదు గుంపులు ఉన్నయ్. ​గుత్తా సుఖేందర్​రెడ్డి నల్గొండలోని ఏడు సెగ్మెంట్లలో ఏడు కుంపట్లు పెట్టిండు. ఐదు గ్రూపుల బీఆర్ఎస్ ను ఓడిస్తం” అని చెప్పారు. 

శుక్రవారం నల్గొండలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీ జరిగింది. ఇందులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. దళితబంధు స్కీమ్​లో 30 శాతం కమీషన్లు తీసుకున్న ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసే దమ్ము కేసీఆర్​కు ఉందా? అని ఆయన సవాల్ విసిరారు. కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యేలు 40 శాతం కమీషన్లు తీసుకుంటుంటే, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఒకప్పుడు తినడానికి తిండి లేని మంత్రి జగదీశ్ రెడ్డికి మొయినాబాద్ వద్ద 80 ఎకరాల ఫామ్ హౌస్ ఎట్ల వచ్చిందని ప్రశ్నించారు. ‘‘మరో మంత్రి నిరంజన్ నోరు విప్పితే.. ‘ఎవరో ఏదో అంటే నువ్వెందుకు మాట్లాడుతున్నవ్’  అని కేసీఆర్ హెచ్చరించారు. అంటే మంత్రుల అవినీతిని కేసీఆర్ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు” అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. ‘‘నల్గొండలో పోటీ చేసేది నేనే. బీఫామ్ ఇచ్చేది పీసీసీ ప్రెసిడెంట్ అయినా..  నా బీఫామ్ నా ఇంటికే వస్తుంది” అని అన్నారు. 

మే మొదటి వారంలో ప్రియాంక సభ: రేవంత్ 

టీఎస్ పీఎస్సీ క్వశ్చన్ పేపర్లను కేసీఆర్ ప్రభుత్వం అమ్ముకుంటోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘‘కేసీఆర్ కుటుంబం రాజ్యాలు ఏలుతుంటే.. పేదల బిడ్డలు కులవృత్తులు చేసుకొని బతకాలా? రాష్ట్రంలోని నిరుద్యోగులు హైదరాబాద్​లో అడ్డా మీద కూలీల్లా బతకాల్సిందేనా?” అని మండిపడ్డారు. పరీక్షలు నిర్వహించాల్సిన సీఎం కేసీఆర్.. పార్టీ విస్తరణ పేరుతో రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దళితబంధు స్కీమ్ లో 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని, ఇలాంటి సర్కార్ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. నల్గొండలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని.. ఇసుక, లిక్కర్ మాఫియా నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఎంతో మంది గొప్ప నాయకులు ఇక్కడ పుట్టారని, ఇది పోరాటాల గడ్డ అని.. ఈ ఎమ్మెల్యేలందరూ నల్గొండ ఇజ్జత్ తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జనతా బార్​లో పర్మిట్ రూమ్ అడ్డాల్లా మారిపోయాయి. ఓ వైపు పంటలు నష్టపోయి రైతులు కన్నీళ్లు పెడ్తుంటే.. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు మాత్రం ఆత్మీ య సమ్మేళనాల పేరుతో తాగి చిందులు వేస్తున్నారు” అని ఫైర్ అయ్యారు. ‘‘ఇలాంటి సర్కార్ ను గద్దె దించుదాం. కొత్త ఏడాదిలో కొత్త ప్రభుత్వం తెచ్చుకుందాం. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసుకుందాం” అని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘కేసీఆర్ చివరి నిమిషంలో చేతులెత్తేసి ఉద్యమం నడపడం తన వల్ల కాదని జానారెడ్డి కాళ్ల మీద పడితే.. జానారెడ్డి ఇంట్లోనే జేఏసీ పురుడుపోసుకున్నది. జేఏసీ అంటే జానా యాక్షన్​ కమిటీ” అని అన్నారు. మే మొదటి వారంలో హైదరాబాద్​లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, దానికి ప్రియాంక గాంధీ వస్తారని తెలిపారు. 

వచ్చే ఎన్నికల్లో 12 సీట్లు గెలుస్తం: ఉత్తమ్ 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దందాలు చేస్తూ వందల కోట్లు సంపాదిస్తున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇసుక, భూములు, మైన్స్, వైన్స్ దందాలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. నల్గొండ కాంగ్రెస్ కు కంచుకోట అని, వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం, ఉదయసముద్రం ప్రాజెక్టు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల టైమ్ లో మొదలు పెట్టిన పనులు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసమర్థ, అవినీతి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

సీఎం పదవికి సిద్ధం: జానారెడ్డి 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి ప్రకటించారు. నిరుద్యోగ నిరసన ర్యాలీకి ముందు ఉత్తమ్ తో కలిసి జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘వచ్చే ఎన్నికల్లో నా ఇద్దరు కొడుకుల్లో ఒకరిని ఎమ్మెల్యేగా నిలబెడతాను. ఉత్తమ్ లాంటి సీనియర్లు నాకు సహకరించి, పార్టీ హైకమాండ్​ ఆమోదిస్తే సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు నా కొడుకును ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి, ఆ స్థానం నుంచి నేను నిలబడతాను” అని చెప్పారు. 

పొగుడుకున్న రేవంత్, వెంకట్ రెడ్డి 

రేవంత్, వెంకట్ రెడ్డి ఒకరినొకరు ప్రశంసించుకున్నారు. ‘‘తెలంగాణ తొలి దశ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం పదవులు త్యాగం చేసింది కొండా లక్ష్మణ్​బాపూజీ అయితే.. మలి దశ ఉద్యమంలో తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి” అని రేవంత్ ​కొనియాడారు. ‘‘నల్గొండ జిల్లాకు మొదటిసారి వచ్చిన రేవంత్.. తాత అయి వచ్చిండు. కానీ మనిషిని చూస్తే మాత్రం పెళ్లి కొడుకు లాగే కనిపిస్తున్నడు” అని వెంకట్ రెడ్డి అన్నారు.

ఒకేరోజు 4 పరీక్షలా?

ఒకేరోజు నాలుగు ఉద్యోగ పరీక్షలు నిర్వహిస్తుండడంతో రాష్ట్ర సర్కార్ పై రేవంత్ ఫైర్ అయ్యారు. ‘‘ఈ ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రావడమే గగనం. కానీ ఏప్రిల్ 30న ఒకే రోజు నాలుగు శాఖల కొలువులకు పరీక్షలు అనడం అవివేకం. లక్షలాది మంది ఉద్యోగార్థులకు ఇది శాపం. ఆ నాలుగు పరీక్షలను రీషెడ్యూల్​ చేయాలి. అందరికీ, అన్ని పరీక్షలు రాసేలా అవకాశం కల్పించాలి. దీనిపై సీఎం వెంటనే జోక్యం చేసుకోవాలి’’ అని ఆయన ట్వీట్​ చేశారు.

పంటల పరిశీలనకు టీమ్​లు

హైదరాబాద్, వెలుగు: వడగండ్లతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు, పంట నష్టం వివరాలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ నాలుగు బృందాలను నియమించింది. ఈ బృందాల్లోని సభ్యులు వడగండ్ల వానల ప్రభావం అధికంగా ఉన్న మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించనున్నారు. ఆ బృందాలతో కాంగ్రెస్​కిసాన్ సెల్​జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్ రెడ్డి సమన్వయం చేయనున్నారు. ఈ బృందాల వివరాలను శుక్రవారం గాంధీభవన్​లో పీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు వడగండ్ల వానలతో నష్టపోయినా సీఎం కేసీఆర్​ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. గత 50 ఏండ్లలో ఇంతటి విపత్కర పరిస్థితి ఎన్నడూ లేదని కోదండరెడ్డి అన్నారు.