బీఆర్ఎస్ రెండు సీట్లు గెలిచినా మంత్రి పదవికి రిజైన్ చేస్తా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు రెండు సీట్లు వచ్చినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. శ్రీకాంతాచారి సాక్షిగా చెబుతున్నా..ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేయకపోతే తాను రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటానని, లేదంటే డొక్కు కారును అమ్ముకుంటారా? అని ప్రశ్నించారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో కోమటిరెడ్డి మాట్లాడారు. 

తనకు సీఎం పదవిపై ఆశ లేదని, వచ్చే పదేండ్లు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. రేవంత్ నాయకత్వంలో మంత్రులమంతా టీమ్ వర్క్ చేస్తున్నామన్నారు.  పదవులపై ఆశ లేదు. ఇప్పుడున్న మంత్రి పదవి చాలన్నారు . రఘువీర్ రెడ్డి గెలుపు ఖరారైంది. మెజారిటీ కోసమే పని చేస్తున్నాం. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్​ ప్రజలను మోసగించారు. కమీషన్ల కోసం కాళేశ్వరాన్ని కట్టిండు. నక్కలగండి ద్వారా దేవరకొండ, మునుగోడు కు నీళ్లివ్వలేదు. జిల్లాను పట్టించుకోని కేసీఆర్.. నేడు ఏ ముఖం పెట్టుకొని మిర్యాలగూడ వస్తున్నాడు. ఇక్కడికి రావడానికి సిగ్గుండాలి” అని మండిపడ్డారు.

దోచుకున్న డబ్బుతో జగదీశ్​రెడ్డి సూర్యాపేటలో గెలిచాడు. తన టీవీ చానెల్​ ఎవరూ చూడరని వేరే చానల్​లో కేసీఆర్​ మాట్లాడారు. కవిత జైల్లో ఉన్నా కేసీఆర్ తీరు మారడం లేదు.  మెదక్​లో కూడా కాంగ్రెస్సే గెలుస్తుందన్నారు కోమటిరెడ్డి.