- కేటీఆరే.. అప్పుడు తీసుకొని ఇప్పుడు విమర్శలా?
- మేం అభివృద్ది చేస్తుంటే విమర్శలా
- పారిశ్రామిక వ్యర్థాలన్నీ నదిలోకే..
- దుర్వాసనతో ప్రాణాంతక రోగాలు
- ప్రక్షాళను ప్రజల నుంచి మద్దతు
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్: కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు మూసీ రివర్ డెవలప్ మెంట్ అథారిటీ పేరుతో రూ. వెయ్యి కోట్ల లోన్ తీసుకొని అటకెక్కించారని, తాము అభివృద్ధి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ఇవాళ హైదరాబాద్ నోవాటెల్ లో నిర్వహించి అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాచారం, జీడిమెట్ల, పరిశ్రమలతో పాటు మూసీ వెంట ఉన్న అనేక పరిశ్రమలు తమ వ్యర్థ జలాలను మూసీలోకి వదులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ దుర్వాసన కారణంగా లక్షలాది మంది రోగాల బారిన పడుతున్నారని అన్నారు. క్యాన్సర్ వంటి మహహ్మారితో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సబర్మతి, నమామి గంగే ప్రాజెక్టులు చేసినట్లుగానే మూసీని ఎందుకు ప్రక్షాళన చేయొద్దనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.
మూసీ నిర్వాసిత ప్రజలు ప్రభుత్వానికి సహకరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వివరించారు. రాజకీయంగా విమర్శించే వాళ్లు విమర్శిస్తూనే ఉంటారని కానీ ప్రజల ఆరోగ్యం కోసం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామన్నారు. తర్వాత ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో అనేది ఆలోచించకుండా కేవలం ప్రజల ప్రయోజనార్థమే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులు ఆందోళన చేస్తున్నా వారిని పట్టించుకోకుండా కేసీఆర్ కాళేశ్వరం నిర్మిస్తే అది కాస్తా కూలిపోయి రూ.2 లక్షల కోట్లు నీటిపాలైందన్నారు.
డీపీఆర్ సిద్దం కాకముందే ఇవేం ఆరోపణలు?
మూసీ సుందరీకరణ కోసం రూ.1.50 లక్షల కోట్లా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. డీపీఆర్ సిద్ధం చేయకముందే కేటీఆర్ ఆ ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కావాలనే ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే విమర్శలు చేస్తున్నారని కానీ ఎట్టి పరిస్థితుల్లో మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పారు.