యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ ఎయిమ్స్ ను కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సందర్శించారు. రూ.1021 కోట్ల తో ఎయిమ్స్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. నాగార్జున కన్స్ స్ట్రక్షన్ వాళ్ళకు 2023లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరామని ఆయన వెల్లడించారు. ఇండియాలోనే బెస్ట్ ఎయిమ్స్ గా.. బీబీ నగర్ ఎయిమ్స్ ను తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి తనకు హామీ ఇచ్చారన్నారు. భువనగిరి, నల్లగొండ జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్న ఆయన... గాంధీ, ఉస్మానియాలు మాత్రమే పెద్ద ఆసుపత్రులుగా ఉన్నాయన్నారు. ఆ ఆస్పత్రులకు పోయేవరకు ఎంతోమంది రోగులు చనిపోతున్నారని, అందుకే బీబీ నగర్ ఎయిమ్స్ ని అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశానని తెలిపారు.
బీబీనగర్ ఎయిమ్స్ లో ఓపీ సేవలు భేష్
బీబీనగర్ ఎయిమ్స్ కు రావటం , అందర్నీ కలవటం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. దేశంలో ఎయిమ్స్ లను ఏర్పాటు చేశామని, నాణ్యమైన వైద్య విద్య, వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. ఓపీ సేవలు మంచిగా అందుతున్నాయని బీబీ నగర్ ఎయిమ్స్ కి కితాబిచ్చారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వైద్యుల సేవలు అమోఘమన్నారు. ఆయుష్మాన్ భారత్ మిషన్ ద్వారా సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందుతోందన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ కు సంబంధించిన సమస్యలను రివ్యూ మీటింగ్ లో అధికారులు చెప్పారని, వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.