నల్గొండ, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ గోడలు బద్దలవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ సర్కారును ముట్టుకుంటే బీఆర్ఎస్ పై తెలంగాణ ప్రజలే తిరుగుబాటు చేస్తారని అన్నారు. నల్గొండ, గుర్రంపోడు మండలాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. తాము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని.. అనవసరంగా తమను డిస్టర్బ్ చెయ్యాలని చూస్తే బీఆర్ఎస్ ఒక్క రోజులో ఖాళీ అవుతుందన్నారు.
ఆ ముగ్గురు మినహా బీఆర్ఎస్ లో ఎవరు మిగలరన్నారు. బీఆర్ఎస్ లీడర్లు మాయమాటలు చెప్పి పదేండ్లు ప్రజల్ని ఆగం చేశారని మండిడ్డారు. అధికారం పోయినా కేటీఆర్ అహంకారం తగ్గలేదని..కాంగ్రెస్ పార్టీని గానీ, తనను గానీ టచ్ చేస్తే సత్తా చూపిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్లితతవ్వకుండా రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృధా చేశారన్నారు. పైగా మూడు పిల్లర్లు కుంగితే ఏమవుతుందని తేలిగ్గా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు, బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం మీద పెట్టిన శ్రద్ధలో పదిశాతం పెట్టినా ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయి నల్గొండకు తాగునీళ్లు, సాగునీళ్లు వచ్చేవన్నారు.
శ్రీశైలంలో డెడ్ స్టోరేజీ నీళ్లున్న నల్గొండ జిల్లాలో నీటి కొరత ఉండకపోయేదన్నారు . కాంగ్రెస్ హయాంలో రాబోయే రెండేళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ఏపీ సీఎం జగన్ 8800 క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతుంటే తన రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ ప్రేక్షకపాత్ర పోషించారని ఫైర్అయ్యారు. బీఆర్ఎస్ నేత జగదీశ్‌రెడ్డి మంత్రిగా వేల కోట్లు దోచుకున్నాడన్నారు. గొర్రెల స్కీం పెద్ద స్కామ్ అని, ఆ స్కీంతో గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు,అధికారులు బాగు పడ్డారన్నారు. యాదవులంతా గొర్రెల కోసం కట్టిన డీడీలంతా వాపస్ తీసుకోవాలని కోరారు. గొర్రెలస్కీమ్ లో జరిగిన అవినీతిపై ఇప్పటికే విచారణ చేపట్టడం జరిగిందని.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ ఎన్నికల్లో నల్గొండ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.