నార్కట్‌పల్లి,వెలుగు : కేసీఆర్ ఫ్యామిలీ10 ఏళ్లలో 7 లక్షల కోట్లు దోచుకుందని రోడ్ల భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నార్కట్‌పల్లి మండలం బ్రహ్మణ వెల్లంల గ్రామంలో రూ.67 కోట్లతో చేపట్టిన నల్గొండ, బ్రాహ్మణ వెల్లంల, చిట్యాల నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో బ్రాహ్మణవెల్లంల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు మొదట శంకుస్థాపన చేశామని చెప్పారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ను పదేండ్లలో కేసీఆర్పూర్తి చేయలేదని, వచ్చే వానాకాలం నాటికి ప్రాజెక్టు ను పూర్తి చేస్తామన్నారు. తనను పెంచి పోషించిన గ్రామానికి ఎంత చేసినా తక్కువేనన్నారు.
ప్రతీక్ పేరు మీద ఇక్కడ లైబ్రరీ నిర్మిస్తానన్నారు. ఎమ్మెల్యే, మంత్రిగా,ఎంపీగా 30ఏళ్లలో తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. గ్రామంలో ఇల్లు లేని పేదలందరికీ కోమటిరెడ్డి అనిల్ రెడ్డి సహకారంతో మూడు ఎకరాల్లో ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు రూ. కోటి రుణాలు ఇస్తామన్నారు. నార్కెట్పల్లి మండలంలోని అన్ని రోడ్లకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.