మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొంటారని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తెలిపారు. ఇప్పటికే తాను, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పామని.. వెంకటరెడ్డితో ప్రియాంక గాంధీ కూడా మాట్లాడతారన్నారు. మునుగోడు అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామన్నా ఆయన.. టీఆర్ఎస్, బీజేపీ మునుగోడు ఎన్నికను రాజకీయ క్రీడగా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఒక వైపు ఓవైసి, మరో వైపు రాజా సింగ్ మత విద్వేషాలను రెచ్చకొడుతున్నారని ఆరోపించారు.
విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వలేని టీఆర్ఎస్ ప్రభుత్వం.. మునుగోడులో డబ్బుల ప్రవాహాన్ని పారిస్తోందని అద్దంకి దయాకర్ ఆరోపించారు. తన సొంత లాభంకోసం రాజగోపాల్ రెడ్డి పార్టీ మారాడని.. మునుగోడు ప్రజలను మోసం చేసిన రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్త తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు.