- మానవత్వం ఉన్నవాళ్లు మూసీ ప్రక్షాళనను అడ్డుకోరు: మంత్రి కోమటిరెడ్డి
- మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి, మేడ్చల్ జిల్లాలకు తాగు నీరు
- ఈ నెల 8న సీఎం శంకుస్థాపన చేస్తారు
- సీఎం టూర్‌పై ఎమ్మెల్యేలు, ఎంపీతో మంత్రి మీటింగ్
హైదరాబాద్, వెలుగు: మల్లన్న సాగర్ నుంచి రూ.210 కోట్ల వ్యయంతో మేడ్చల్, యాదాద్రి జిల్లాలకు తాగు నీరు అందించే పనులకు 8న యాదాద్రి టూర్ లో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. సోమవారం మినిస్టర్ క్వార్టర్స్ లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, అనీల్ కుమార్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, యాదాద్రి డీసీసీ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డిలతో సీఎం టూర్ పై మంత్రి వెంకటరెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మూసీపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని, మూసీపై ప్రభుత్వం ఏం చేయబోతున్నదో ప్రజలకు వివరించాలని సూచించారు. మూసీ బాధితులను రెచ్చగొట్టాలని బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని.. పార్టీ క్యాడర్ ను యాక్టివ్ చేసి తప్పుడు ప్రచారాలను అడ్డుకోవాలని కోరారు.
నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని దాదాపు కోటిన్నర మంది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకే మూసీ శుద్ధీకరణ జరుగుతున్నదని, చిన్న చిన్న కారణాలతో దాన్ని అడ్డుకొని ప్రభుత్వాన్ని బద్నాంచేయాలని చూడడం క్షమించరానిదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై జిల్లా ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కలిసి పోరాడకపోతే ఏండ్లపాటు మూసీ మురికి ప్రజల్ని మరింత పీడిస్తుందని.. అదే జరిగితే రాజకీయాల్లో కొనసాగడం ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల ప్రజలు గోదావరి, కృష్ణా నీళ్లతో వ్యవసాయం చేస్తూ, తాగునీరుగా వాడుకుంటుంటే.. భయంకరమైన రసాయనాలు కలిసిన మురికి నీళ్లను ఉమ్మడి నల్గొండ ప్రజలు ఎందుకు వాడుకోవాలని ఆయన ప్రశ్నించారు.
దశాబ్దాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే.. కాళ్లు, చేతులు వంకర్లుపోయి, క్యాన్సర్ వంటి జబ్బులతో చచ్చిపోతుంటే ఆనాటి బీఆర్ఎస్ పార్టీ కనీసం పట్టించుకున్న పాపానలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ నేతలపై ప్రతిపక్షపార్టీల నేతలు ప్రెస్ మీట్లలో, సోషల్ మీడియా వేదికగా అడ్డగోలుగా విమర్శిస్తుంటే ఇతర నేతలు మౌనంగా ఉండటం భావ్యం కాదని.. అందరం కలిసికట్టుగా విపక్షాలను ఎదుర్కోవాలని ఎంపీ చామల అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను, సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.