గ్యారెంటీ స్కీమ్‌లపై ప్రచారం చేయండి: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్గొండ అర్భన్​, వెలుగు : కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీ స్కీమ్‌లపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యకర్తలకు సూచించారు.  సోమవారం నల్గొండలోని తన క్యాంపు ఆఫీస్‌లో నల్గొండ మండలానికి చెందిన నేతలు, కార్యకర్తలతో గ్రామాల వారీగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తుందన్నారు.  

వీటిపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడంతో పాటు  బీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, మోసపూరిత హామీలను వివరించాలన్నారు. నల్గొండ నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా జరిగిందేమీ లేదన్నారు.  అనంతరం గ్రామాల వారీగా పార్టీ శ్రేణుల సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనిమద్దే సుమన్, వైఎస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేశ్, ఆయా గ్రామాల  అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నేతలు పాల్గొన్నారు. 

అనాథ పిల్లలకు ఎంపీ సాయం 

తల్లిదండ్రులు లేని ముగ్గురు ఆడపిల్లలకు ఎంపీ కోమటి రెడ్డి అండగా నిలిచారు. నల్గొండ మండలం బుద్ధారం గ్రామానికి చెందిన పోలే అశ్విని, సోని, గాయత్రి తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో కూలీ పనులకు వెళ్తున్నారు.  స్థానిక నేతలు ద్వారా విషయం తెలుసుకున్న ఎంపీ సోమవారం తన క్యాంపు ఆఫీస్‌కు పిలిపించి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.1.50 లక్షలు అందించారు. అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.  అలాగే ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన నల్గొండ పట్టణం 13వ వార్డుకు చెందిన కాశమల్ల నేశ్యాకు  రూ. లక్ష అందించారు.