ట్యాంకులు, పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ లీకేజీలకు రిపేర్లు చేయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ అర్బన్​, వెలుగు:  గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు తాగునీటి సమస్య పరిష్కారంపై ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టాలని, ట్యాంకులు, పైప్ లైన్ లీకేజీలు రిపేర్ చేయాలని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ,  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. సోమవారం ప్రత్యేక అధికారులకు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి చీఫ్‌‌‌‌‌‌‌‌ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ..   ఫిబ్రవరి, మార్చి నెలల్లో తాగునీటి సమస్య ఏర్పడే అవకాశం ఉందని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.  

ఎమ్మెల్యేలకు కేటాయించిన నిధుల నుంచి తాగునీటి సమస్య పరిష్కారానికి ఫండ్ ఇస్తామని,  ఏమైనా సమస్య ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు.  కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు.   ప్రత్యేక అధికారులకు తమ విధుల పట్ల అవగాహన ఉండాలన్నారు.  తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని,  ఇంటి పన్ను, లే అవుట్ అనుమతులు, నాలా టాక్స్ సక్రమంగా వసూలు చేయాలని సూచించారు. 

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి 

సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డితో చర్చించి దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఐసీడీఎస్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో మేకల అభినవ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు.  స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దివ్యాంగులకు అవసరమైన పరికరాలను సమకూర్చి శిక్షణ ఇస్తామన్నారు.

రానున్న రోజుల్లో దివ్యాంగులకు మెడికల్ కాలేజీ, మహాత్మా గాంధీ వర్సిటీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాటిచ్చారు. రూ.6 వేల పెన్షన్ ఇవ్వడంతో పాటు రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరిచందన , అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఐసీడీఎస్‌‌‌‌‌‌‌‌ పీడీ కృష్ణవేణి, డీఎస్‌‌‌‌‌‌‌‌వైవో మక్బూల్ అహ్మద్, ఆర్డీవో రవి, తహసీల్దార్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.