తాను, తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వేముల వీరేశం.. త్రిమూర్తులు మాదిరిగా ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటామని ఎంపీ, నల్గొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. అనాడు సోనియాగాంధీని ఎదురించి చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇప్పిస్తే.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో జరిగే ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్, వేముల వీరేశంగా పోల్చారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ లో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా భరోసా సభలో ఎంపీ, నల్గొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు.
2023, డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలు స్వాగతించారని అన్నారు. అధికారంలోకి రాగానే కొత్త ఉద్యోగాలను సృష్టించి.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యను ఎవరూ పట్టించుకోవద్దని చెప్పారు. నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కష్టపడి పని చేయాలని కోరారు. కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి అడ్డుపడ్డా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేరని చెప్పారు.