కమీషన్ల కోసమే కేసీఆర్ ఆరాటం : కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : సీఎం కేసీఆర్​ను గద్దె దించేందుకు ప్రజలు, కార్యకర్తలు, నాయకులంతా మరో నాలుగు 4 రోజులు కష్టపడాలని కాంగ్రెస్​ స్టార్​ క్యాంపెయినర్,  నల్గొండ కాంగ్రెస్​ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు. సోమవారం తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్  ప్రభుత్వమే అని, ప్రజలు తమ పార్టీ వైపే ఉన్నారన్నారు. కేసీఆర్​ ప్రజల బాగోగులు చూడకుండా కమీషన్ల కోసమే పని చేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్  మోసం చేశారని ఆయన విమర్శించారు. గ్రూప్ 2 పేపర్  రెండు సార్లు లీక్ అయిందని, నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 డబుల్  బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని ఒక్క పేదవాడికి  కూడా పదేండ్లలో ఇల్లు కట్టివ్వలేదని, ఒక్క కొత్త రేషన్  కార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గ్యారంటీ పథకాలు అమలు చేయకుంటే లోక్ సభ ఎన్నికల్లో ఓటు అడగబోమని స్పష్టం చేశారు. మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, వచ్చే సంక్రాంతికి పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని పేర్కొన్నారు. 

నాలుగు కోట్ల మంది కోసం తెలంగాణ ఇస్తే కల్వకుంట్ల కుటుంబం పదవులు అనుభవిస్తున్నదని, అమరుల త్యాగాన్ని ఆ కుటుంబం ఆగం చేసిందన్నారు. ఎస్ఎల్​బీసీ సొరంగాన్ని తాము 90 శాతం పూర్తి చేశామని, కానీ ఎక్కడ తనకు పేరు వస్తుందోనన్న అసూయతో కేసీఆర్  మిగిలిన పనిని పూర్తి చేయలేదని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీపై తొలి సంతకం చేస్తామని, నిరుద్యోగులకు ఏటా జాబ్  క్యాలెండర్   విడుదల చేస్తామని, రైతు భరోసాతో పాటు కౌలు రైతులకూ ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన చెప్పారు.