లింగంపేట, వెలుగు: రైతులకు పంటరుణాలు మంజూరు చేయడంలో స్థానిక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్, ఫీల్డ్‌ఆఫీసర్ కలిసి బ్రోకర్లను ఏర్పాటు చేసి, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని బాధిత రైతులు వాపోయారు. లంచం తీసుకొని రుణాలు మంజూరు చేసిన బ్యాంక్ సిబ్బంది, బ్రోకర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. లింగంపేట మండలంలోని కోమట్‌పల్లి గ్రామానికి చెందిన వేల్పుల సాయిలు, బాలనర్సమ్మ, వెల్పుల సంగయ్య, నెల్లూరి బాలకృష్ణ, గంపల తిరుపతి తదితరులు క్రాప్‌లోన్ల మంజూరుకు బ్రోకర్‌గా వ్యవహరించిన రాంపల్లి గ్రామానికి చెందిన మార్గం సాయిలు, బ్యాంక్అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రాప్లోన్కోసం ఈ ఏడాది మార్చిలో బ్యాంక్ మేనేజర్‌ను కలిసి లోన్ ఇవ్వాలని అడిగినా, అందుకు మేనేజర్ నిరాకరించినట్లు పేర్కొన్నారు.
తర్వాత మార్గం సాయిలు అనే వ్యక్తి లోన్లు ఇప్పిస్తానని, లక్షకు రూ.25 వేల చొప్పున వసూలు చేశాడని పేర్కొన్నారు. మరుసటి రోజే మాకు లోన్లు మంజూరు చేశారని బాధితులు తెలిపారు. ఈ దోపిడిలో బ్యాంక్ మేనేజర్‌కు, ఫీల్డ్ఆఫీసర్కు వాటాలు ఉన్నట్లు బాధితులు ఆరోపించారు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ఆర్యరాజ్ను ప్రశ్నించగా తాను ఎవరి నుంచి నయా పైసా లంచం తీసుకోలేదని పేర్కొన్నారు. రైతులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శంకర్ తెలిపారు.