పరిహారం చెల్లింపులో సిద్దిపేటకు ఓ రూల్​.. పాలమూరుకు మరో రూలా?

పరిహారం చెల్లింపులో సిద్దిపేటకు ఓ రూల్​.. పాలమూరుకు మరో రూలా?
  • అధికారంలోకి రాగానే ఉదండాపూర్​ నిర్వాసితులను ఆదుకుంటం
  • సీఎం ఎవరైనా ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతం
  • బీఆర్ఎస్​ లీడర్​పై దాడి ఓ కుట్ర
  • ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి  

జడ్చర్ల టౌన్, వెలుగు:  కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఉదండాపూర్​భూ నిర్వాసితులను ఆదుకుంటామని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్​ స్టార్​ క్యాంపెయినర్​ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్​తన సొంత జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్​భూ నిర్వాసితులకు అధికారికంగా ఎకరాకు రూ.17లక్షలతో పాటు కాంట్రాక్టర్​తో మాట్లాడి మరో లక్ష ఇప్పించారని, డబుల్​బెడ్​రూం ఇండ్లను కూడా ఇచ్చారని గుర్తు చేశారు. అలాంటి ప్యాకేజీని పాలమూరు లిఫ్ట్​​ఇరిగేషన్​లో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్​ నిర్వాసితులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. సిద్దిపేటకు ఒక రూల్..పాలమూరుకు మరో రూల్​ఉంటుందా అని నిలదీశారు. మంగళవారం జడ్చర్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్లకు వస్తే సమస్యలే లేవన్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రెండు పోలీస్​స్టేషన్లు, బైపాస్​రోడ్డును అడగడం విచిత్రమన్నారు. ఆయన అడిగిన కోరికలను విన్న ప్రజలు నవ్వుకున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఉదండాపూర్​నిర్వాసితులను ఆదుకుంటామని చెప్పడం విడ్డూరమన్నారు. తొమ్మిదేండ్లు ఏమీ చేయకుండా, అధికారంలోకి వస్తే చేస్తామనడం విడ్డూరమన్నారు. ఫాంహౌస్​లో పడుకొని బయటకు రాని సీఎం ఓడిపోతామనే భయంతో రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నాడని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్​ లీడర్​పై అధికార పార్టీ కార్యకర్తనే దాడి చేస్తే కాంగ్రెస్ ​కార్యకర్త దాడికి పాల్పడినట్టు డ్రామా క్రియేట్​చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సీఎం ఎవరైనా  ప్రకటించిన ఆరు స్కీంలను అమలు చేయడం జరుగుతుందన్నారు.

36 మంది పిల్లలు సచ్చిపోయిన్రు...

ఏపీలోబ్లాక్ లిస్ట్​లో ఉన్న కంపెనీకి చెందిన కేటీఆర్​బంధువుకు ఇంటర్​ పేపర్లు దిద్దేందుకు రూ.355 కోట్ల కాంట్రాక్ట్​ఇచ్చారని, 95 మార్కులు రావాల్సిన పిల్లలను ఫెయిల్ ​చేస్తే 36 మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఐదు సార్లు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్​ నిర్వహించగా, ప్రభుత్వ వైఫల్యంతో వాయిదా పడ్డాయని, దీంతో ప్రవళిక ఆత్మహత్య  చేసుకుందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే అభ్యర్థి అనిరుధ్​రెడ్డి, రబ్బానీ, బుక్కా వెంకటేశం, నిత్యానందం, మినాజ్, ఖాజాపాషా పాల్గొన్నారు.