కొమ్మాల జాతరలో ప్రభ బండ్ల లొల్లి

కొమ్మాల జాతరలో ప్రభ బండ్ల లొల్లి
  • బీఆర్ఎస్  నేతల ఆందోళన, బారికేడ్లు ధ్వంసం 
  • గిర్నిబావి వద్ద పోలీసుల లాఠీచార్జి

నర్సంపేట/నల్లబెల్లి, వెలుగు: వరంగల్​ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి సెంటర్​లో శనివారం ప్రభ బండ్ల లొల్లి లాఠీచార్జీకి దారితీసింది. గీసుగొండ మండలం కొమ్మాల లక్ష్మీ నర్సింహస్వామి జాతరకు పోటాపోటీగా వెళ్లే క్రమంలో గొడవ జరిగింది. నర్సంపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్​ నాయకులు, కార్యకర్తలు  మధ్య తోపులాట జరగడంతో లాఠీచార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. 

రాజకీయ ఘర్షణలు తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. నర్సంపేట, కొమ్మాల రూట్​లో పలు చోట్ల చెక్​పోస్టులను ఏర్పాటు చేశారు. ఆయా పార్టీల ప్రభ బండ్లు వెళ్లేందుకు టైం కేటాయించారు. దుగ్గొండి మండలం తొగర్రాయి సమీప తండాలకు చెందిన ఆరు ప్రభ బండ్లు రావడం ఆలస్యం కావడంతో, బీఆర్ఎస్​ కార్యకర్తలు గిర్నిబావి చెక్​పోస్టు వద్ద బారికేడ్లను ధ్వంసం చేశారు. ఈక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్​ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. కాగా, కొంత మంది పటాకులు కాల్చడంతో పోలీసులు కాల్పులు జరిపారనే ప్రచారం జరిగింది. వరంగల్​ ఈస్ట్​ జోన్​ డీసీపీ అంకిత్​కుమార్, నర్సంపేట ఏసీపీ కిరణ్​కుమార్​ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

ఫేక్‍ ప్రచారం చేసిన వారిపై చర్యలు..

వరంగల్‍: కొమ్మాల జాతరకు ప్రభ బండ్లు తరలివచ్చిన క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని వరంగల్‍ సీపీ సన్‍ప్రీత్‍సింగ్‍ తెలిపారు. పోలీసుల ఆదేశాలను పాటించకుండా బండ్లను ముందుకు తీసుకువెళ్లే క్రమంలో తోపులాట జరిగిందన్నారు. కొన్ని ప్రచార మాధ్యమాల్లో పోలీసులు కాల్పులు జరిపారంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేశారని, ఫేక్​ వార్తలు రాసిన వారితో పాటు సోషల్‍ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై క్రిమినల్‍ చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.