
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. జాతరలో భాగంగా ఏడో ఆదివారానికి తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కొమురవెల్లి ఆలయ ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మారుమోగింది. భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించి కోనేరులో స్నానాలు చేశారు. అనంతరం గంగరేణి చెట్టు, ఆలయ ముఖ మంటపం వద్ద పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ సమేత మల్లన్నను దర్శించుకున్నారు.
భక్తుల రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి ఆరు గంటల టైం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామివారి దర్శనం అనంతరం మల్లన్న గుట్టపైన కొలువుదీరిన రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఆఫీసర్లు ఏర్పాట్లు చేయగా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.