
కొమురవెల్లి మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరగింది. జనవరి 7వ తేదీ ఆదివారం ఉదయం10.45 గంటలకు వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం ఉజ్జయిని పీఠాధిపతి, జగద్గురు సిద్దిలింగ రాజకేంద్ర శివాచార్య మహాస్వామిజీ పర్యవేక్షణలో స్వామివారి కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారికీ ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
మల్లన్న కల్యాణం నేపథ్యంలో ఆలయాన్ని, రాజగోపురాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాజగోపురం నుంచి తోటబావి వరకు పందిళ్లు వేసి ముస్తాబు చేశారు. కల్యాణ మండపంలో వీవీఐపీలు, వీఐపీ, దాతలు, భక్తుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుడి మల్లికార్జున్ ఇంట్లో వీరభద్రుని ఖడ్గం, పళ్లేరానికి ప్రత్యేక పూజలు చేసి రతి బియ్యం సేకరించారు. ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు మల్లికార్జున స్వామి రథోత్సవంతో కల్యాణ తంతు ముగుస్తుంది.