![కొమురెల్లి మల్లన్న లగ్గం..](https://static.v6velugu.com/uploads/2024/01/komuravelli-mallanna-kalyanam-to-be-held-today12_VWXlxFqCnU.jpg)
- పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లన్న కల్యాణం ఆదివారం జరగనుంది. మల్లన్న లగ్గానికి ఆలయం వద్ద తోటబావి ప్రాంగణం ముస్తాబైంది. ఆదివారం ఉదయం10.45 గంటలకు వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం ఉజ్జయిని పీఠాధిపతి, జగద్గురు సిద్దిలింగ రాజకేంద్ర శివాచార్య మహాస్వామిజీ పర్యవేక్షణలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మల్లన్న ఆలయాన్ని, రాజగోపురాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాజగోపురం నుంచి తోటబావి వరకు పందిళ్లు వేసి ముస్తాబు చేశారు. కల్యాణ మండపంలో వీవీఐపీలు, వీఐపీ, దాతలు, భక్తుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుడి మల్లికార్జున్ ఇంట్లో వీరభద్రుని ఖడ్గం, పళ్లేరానికి ప్రత్యేక పూజలు చేసి రతి బియ్యం సేకరించారు. ఆ తర్వాత అర్చకులు.. గ్రామస్తుల నుంచి బియ్యం సేకరించి మల్లన్న ఆలయానికి చేర్చారు. ఈ బియ్యాన్ని మల్లన్న కల్యాణం రోజు తెల్లవారుజామున దృష్టి కుంభాలలో వినియోస్తారు. ప్రభుత్వం తరఫున మల్లన్న స్వామి, మేడలాదేవి, గొల్లకేతమ్మకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం ఏడు గంటలకు మల్లికార్జున స్వామి రథోత్సవంతో కల్యాణ తంతు ముగుస్తుంది. అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.