- ఐదు క్వింటాల్ల సమిధలతో అగ్నిగుండాలు
- పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
శివసత్తుల పూనకాలు, మల్లన్న నామస్మరణతో సిద్దిపేట జిల్లాలోని కొమురెల్లి మార్మోగింది. పట్నంవారం సందర్భంగా సోమవారం 21 వరుసల పెద్దపట్నం, అగ్నిగుండాలు ఘనంగా నిర్వహించారు. ఐదు క్వింటాళ్ల సమిధలతో అగ్నిగుండాలను తయారు చేశారు. విగ్రహాలతో అర్చకులు అగ్నిగుండాలు దాటగా.. శివసత్తులు పెద్దపట్నం తొక్కుతూ మల్లికార్జున స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నరు. 50 వేల మందికి పైగా భక్తులు మల్లన్నను దర్శించుకున్నారు.
కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయ తోటబావి ప్రాంగణంలో పట్నంవారం సందర్భంగా సోమవారం 21 వరుసల పెద్దపట్నం, అగ్నిగుండాలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన మాణుక పోచయ్య యాదవ్ కుటుంబసభ్యులతోపాటు యాదగిరిరావు యాదవ్, మాణుక విజయ్ కుమార్ యాదవ్, బండారి దుర్గా రాజు యాదవ్ కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్దపట్నం వేసి ఐదు క్వింటాళ్ల సమిధలతో అగ్నిగుండాలను తయారు చేశారు. ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, మహాదేవుని రవితో పాటు మిగతా అర్చకులు ఉత్సవ విగ్రహాలను అగ్నిగుండాల వద్దకు చేర్చి పూజలు చేశారు. అనంతరం విగ్రహాలతో అర్చకులు అగ్నిగుండాలు దాటగా శివసత్తులు పెద్దపట్నం తొక్కుతూ మల్లికార్జున స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నరు. భక్తులు అగ్నిగుండాలు దాటి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఆనవాయితీ ప్రకారం శివసత్తులకు మల్లికార్జునస్వామి ఆలయ అధికారులు బట్టలు పెట్టి సన్మానించారు.