
- హద్దులు లేక ఆక్రమణలు
- ఇంకా అందని భూముల పట్టాలు
- చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
సిద్దిపేట, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయ భూములు కబ్జాకు గురవుతున్నాయి. అధికారులు భూములకు సంబంధించి హద్దులు నిర్ణయించకపోవడంతో అన్యాక్రాంతం అవుతున్నాయి. దశాబ్దం కిందట అప్పటి సీఎం కేసీఆర్ అభివృద్ధి పనుల కోసం భూములు సేకరించాలని ఆదేశించారు. అధికారులు ఆరు గ్రామాల పరిధిలో 160 ఎకరాలను గుర్తించినా 131.09 ఎకరాలను మాత్రమే మల్లికార్జున స్వామి పేరిట నమోదు చేశారు. కొమురవెల్లిలో 76.28, కిష్టంపేట లో 27.16, రాంసాగర్ లో 11.01, గౌరాయపల్లిలో 11.01, వేచరేణిలో10.04 ఎకరాల భూమిని మల్లన్న ఆలయానికి కేటాయించారు. ఇవి కాకుండా ఆలయ నిధులతో 19.25 ఎకరాల పట్టా భూమిని వివిధ అవసరాల కోసం కొనుగోలు చేశారు.
హద్దులతోనే సమస్య
మల్లన్న ఆలయానికి ఎకరాల కొద్దీ భూములన్నా వాటి హద్దుల విషయంలోనే సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటికి సంబంధించి రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయి లో సర్వే చేసి ధరణిలో నమోదు చేసినా ఇంకా పట్టాలు ఇవ్వలేదు. దీంతో హద్దులు నిర్ధారించే సమయంలో ప్రైవేటు వ్యక్తుల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిని అదునుగా తీసుకొని కబ్జాదారులు భూములను ఆక్రమిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆలయ భూములుగా పేర్కొంటు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగిస్తున్నారు. మరికొన్ని చోట్ల హద్దు రాళ్లను తొలగిస్తూ దేవుడి భూమిని ఆక్రమిస్తున్నారు.
ఆక్రమణలకు యత్నాలు
రాజీవ్ రహదారికి సమీపంలో ఆలయానికి సంబంధించిన భూములుండగా వాటిలో కొందరు నిర్మాణాలకు యత్నించారు. కొన్ని చోట్ల భూమిని చదును చేసి ఆక్రమించే ప్రయత్నాలు చేయగా ఆలయ అధికారులు అడ్డుకున్నారు. మరికొన్ని చోట్ల ఆలయానికి సబంధించిన భూముల్లో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. వీటిపై ఆలయ అధికారులు పీఎస్‌లలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇటీవల ఆలయ భూమిలో కొందరు ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టగా వాటిని అధికారులు కూల్చివేశారు. మల్లన్న ఆలయ భూముల కబ్జాలపై పొలిటికల్పార్టీలు పలుమార్లు ఆందోళనలకు దిగారు. విలువైన భూములు కబ్జాకు గురికాకుండా అడ్డుకున్నారు. ఆలయ భూములకు సంబంధించి పట్టా బుక్‌లను అందిస్తే రక్షణ చర్యలు చేపట్టే అవకాశం ఉన్నా ఆ దిశగా పనులు చేయడంలేదని ఆరోపిస్తున్నారు.
ఆలయ భూములను రక్షించాలి
కొమురవెల్లి మల్లన్న ఆలయ భూముల పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలి. భూములకు సంబంధించిన పత్రాలను దేవస్థానానికి అప్పగించాలి. ఆలయ భూములపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయించి రక్షించాలి.
- శెట్టిపల్లి సత్తిరెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి, కొమురవెల్లి
చర్యలు తీసుకుంటున్నాం
కొమురవెల్లి మల్లన్న ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆలయానికి 131.09 ఎకరాల భూమిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసినట్టు అధికారులు చెప్పారు. వీటికి సంబంధించిన హద్దుల వివరాలు, పట్టా బుక్‌లు ఇవ్వలేదు. వాటిని ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు లేఖ రాశాం. హద్దుల వివరాలు తెలియగానే ఫెన్సింగ్ఏర్పాటు చేస్తాం.
- బాలాజీ, ఆలయ ఈవో