కొమురవెల్లి ఆలయంలో ఆన్ లైన్​ సేవలకు మోక్షమెప్పుడు?

కొమురవెల్లి ఆలయంలో ఆన్ లైన్​ సేవలకు  మోక్షమెప్పుడు?
  • కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఇప్పటికీ కౌంటర్లలోనే టికెట్ల అమ్మకాలు
  • ఆన్​లైన్​ సౌకర్యాల కల్పనపై ఆఫీసర్ల నిరాసక్తత
  • ఇబ్బందిపడుతున్న దూరప్రాంతాల భక్తులు

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులకు ఆన్ లైన్ సేవలు అందడం లేదు. ఈ విషయంలో పాలకమండలి, అధికారులు ఆసక్తి చూపించడం లేదు. ఏటా దాదాపు రూ.20 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నా మల్లన్న ఆలయంలో పట్నాలు, కల్యాణం, ఒడిబియ్యం, అభిషేకం, రుద్రాభిషేకం, అర్చన వంటి సేవలకు ఇప్పటికి కౌంటర్లలోనే టికెట్లు పొందాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర , ఛత్తీస్​గఢ్​ నుంచి పెద్ద ఎత్తున భక్తులు కొమురవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వస్తుంటారు.

 వీరందరూ క్షేత్రానికి వచ్చిన తర్వాతనే వివిధ రకాల సేవల కోసం కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేస్తారు. రాష్ర్టంలోని పలు ఆలయాల్లో ఈ హుండీలు ఏర్పాటు చేస్తుంటే కొమురవెల్లిలో మాత్రం నెట్వర్క్  సమస్య ఉందని పట్టించుకోవడం లేదు. కొంతకాలం కింద టికెట్ల  విక్రయాల  కోసం స్వైపింగ్ మిషన్లు వచ్చినా నెట్ వర్క్ సమస్య ఉందని వాటిని వెనక్కి పంపించారు. ఆన్ లైన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో టికెట్లను రీసైక్లింగ్ చేస్తున్న ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. వారం రోజుల కింద దర్శన టికెట్లను రీసైక్లింగ్ చేస్తూ ఇద్దరు ఆలయ ఉద్యోగుల మధ్య గొడవ జరగడంతో విషయం బయటికి వచ్చింది. 

ఆన్ లైన్ తో పారదర్శకత

ఆన్ లైన్ సేవల వల్ల పారదర్శకతకు అవకాశం ఏర్పడడంతో పాటు దూర ప్రాంతాల్లోని భక్తులు సులభంగా సేవలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉంటే భక్తులు ముందుగానే తమ స్లాట్లను బుక్ చేసుకోవడంతో పాటు ఇతర సేవలకు సంబంధించి టికెట్లు కొనుగోలు చేసి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తారు. ఇప్పటికీ ఆలయ సమీపంలోని 3 కౌంటర్లలో వివిధ సేవలకు సంబంధించి టికెట్లు కొనుగోలు చేయాలి. ఆన్ లైన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు సేవల విషయంలో ఇబ్బందులు ఎదురవుతుండగా కొన్ని సందర్భాల్లో మోసాలు జరుగుతున్నాయి. 

జాతర సమయంలో నెట్ వర్క్ సమస్య

నెట్ వర్క్ సమస్య పేరిట ఆన్ లైన్ సేవల విషయంలో అధికారులు దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారు. మూడు నెలల జాతర సమయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. జాతర సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు రావడంతో నెట్ వర్క్ సమస్య ఏర్పడుతున్నా దీని పరిష్కారం దిశగా అధికారుల ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గతంలో హుండీ నుంచి డబ్బులు బయటికి రావడం, కొందరు చేతివాటాన్ని ప్రదర్శించిన ఉదంతాలు ఉన్నా ఇప్పటికీ ఈ హుండీ ఏర్పాటుచేయడం లేదు. 

ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తెస్తాం

కొమురవెల్లి ఆలయంలో ఆన్ లైన్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. జాతర సమయంలో ఇంటర్ నెట్ సమస్యల వల్ల  ఇబ్బందులు ఏర్పడుతున్న మాట వాస్తవమే. నెట్ వర్క్ సమస్యలను పరిష్కరించి ఈ హుండీలను ఏర్పాటు చేస్తాం. సాంకేతిక కారణాలతో స్వైపింగ్ మిషన్లు వాడకపోవడంతో వాటిని వెనక్కి పంపించాం.   - రామాంజనేయులు, ఈవో, కొమురవెల్లి