
భక్తులతో కిక్కిరిసిపోయిన కొమురవెల్లి
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. కల్యాణోత్సవానికి మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. పట్టు వస్త్రాలు, తలంబ్రాలతో పాటు కోటి రూపాయలతో తయారు చేసిన బంగారు కిరీటం, కోర మీసాలను స్వామికి బహుకరించారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ వచ్చే ఏడాది కల్యాణం నాటికి అమ్మవార్లకు కోటి రూపాయలతో రెండు బంగారు కిరీటాలను చేయిస్తామని ప్రకటించారు.
దాదాపు 30 వేల మంది భక్తులు తరలిరావడంతో ఎలాంటీ ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. 300 మంది పోలీస్ సిబ్బంది శాంతి భద్రతలను పర్యవేక్షించారు. వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ లు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం, 80 సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకున్నారు. కల్యాణోత్సం అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇందుకు దాదాపు మూడు గంటలకు పైగా సమయం పట్టింది. రాత్రి 9 గంటలకు ఘనంగా శకటోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.