ఎక్కడి పనులు అక్కడే.. నాలుగు రోజుల్లో మల్లన్న మహా జాతర ప్రారంభం

  • తాగునీటికి, అద్దె గదులకు కొరతే
  • తాత్కాలిక ఏర్పాట్లపైనే అధికారుల చూపు

సిద్దిపేట, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి మహా జాతర సమీపిస్తున్నా ఏర్పాట్లు ఆశించిన మేర జరగడం లేదు. ఈ నెల 19 నుంచి మూడు నెలల మహాజాతర ప్రారంభమవుతుండగా క్యూలైన్ కాంప్లెక్స్, అద్దె గదుల సత్రం నిర్మాణ పనుల్లో ఎటువంటి ప్రగతి లేదు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. జాతర సమయంలో  తాత్కాలిక ఏర్పాట్లకే ఆలయ అధికారులు ప్రాధాన్యం ఇస్తుండడంతో అసౌకర్యాల మధ్యనే భక్తులు మల్లన్న దర్శనం చేసుకుంటున్నారు. మూడు నెలల కాలంలో దాదాపు పది లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నా వారికి  సౌకర్యాల కల్పన విషయంలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. 

తాగునీటికి తీవ్ర కొరత

మల్లన్న ఆలయంతో పాటు పరిసరాల్లో తాగునీటికి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయం వద్ద మొక్కుబడిగా ఏర్పాటు చేసిన నల్లా ఒక్కటి మాత్రమే ఉంది. దాహమైతే భక్తులు దుకాణాల్లో తాగునీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జాతర సమయంలో దర్శనం కోసం  కనీసం 3 నుంచి 5 గంటల పాటు భక్తులు నిరీక్షించే పరిస్థితి ఉంటుంది. వారికి కనీస సౌకర్యాలు అందించడానికి సైతం ఏర్పాట్లు చేయడం లేదు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నల్లాలు అలంకార ప్రాయంగా మారాయి.

నత్తనడకన అభివృద్ధి పనులు

స్వామి వారి దర్శనానికి  వచ్చే భక్తుల కోసం రూ. 12 కోట్ల అంచనాతో  ప్రారంభించిన క్యూ లైన్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో రోడ్డు పై బారులు తీరే భక్తుల కోసం తాత్కాలికంగా చలువ పందిళ్లు వేస్తున్నారు. మల్లన్న గుట్టపై రూ.10 కోట్ల వ్యయంతో 50 గదుల పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. నాలుగేళ్ల కింద ప్రారంభమైన సత్రం పనులు ఇంకా 70 శాతానికి మించి జరగలేదు. దీంతో భక్తులు వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు గదులను అద్దెకు తీసుకుంటున్నారు. 

పారిశుధ్యం అంతంత మాత్రమే

అద్దె గదుల కొరత వల్ల మల్లన్న దర్శనం కోసం  వచ్చిన భక్తులు రోడ్డు పక్క గుడారాలు వేసుకుని వంటా వార్పు చేసుకోవడంతో పరిసరాలు అధ్వానంగా మారుతున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాత్కాలిక ఏర్పాట్లతో సమస్యకు పరిష్కారం చూపుతామని అధికారులు భావిస్తున్నా అవి రద్దీకి అనుగుణంగా లేకపోవడం గమనార్హం.

అసంపూర్తిగా పాలక వర్గం ఏర్పాటు

కొమురవెల్లి ఆలయ పాలక వర్గం అసంపూర్తిగా  ఏర్పాటు కావడం జాతర పనులు, పర్యవేక్షణపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చైర్మన్ తో సహా మొత్తం 14 మందితో పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం 8 మంది సభ్యులను మాత్ర మే ఎంపిక చేశారు.  మిగిలిన ఆరు స్థానాలకు  కొత్తగా దరఖాస్తులు స్వీకరించినా నియామకపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అసంపూర్తి పాలక మండలి వల్ల చైర్మన్ లేకుండానే సభ్యులే జాతర పనులను పర్యవేక్షించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇబ్బందులు కలగకుండా చూస్తాం

కొమురవెల్లి మల్లన్న జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన  సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం. తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తాం. అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.- రామాంజనేయులు, ఈవో

మల్లన్న మహాజాతర  వివరాలు

19/1/2025    మొదటి వారం(పట్నం వారం)
28/1/2025    రెండో వారం (లష్నర్ వారం)
26/02/2025    మహా శివరాత్రి(పెద్ద పట్నం)
23/03/2025    అగ్ని గుండాలు(జాతర సమాప్తి)