
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు కోనేరులో స్నానాలు చేసి స్వామివారికి నైవేద్యం వండి బోనాలు సమర్పించారు. అనంతరం గంగిరేగి చెట్టు వద్ద పట్నాలు వేశారు.
తర్వాత మల్లికార్జున స్వామికి, బలిజ మేడలమ్మకు, గొల్ల కేతమ్మకు ఒడిబియ్యం పోసి, నిత్య కల్యాణంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఆలయ అధికారులు, ధర్మకర్తలు, సిబ్బంది భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు.