
కొమరవెల్లి, వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి పెద్దపట్నం వేశారు. ముందుగా లింగోద్భవ కాలంలో స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం 1.45 గంటలకు 150 మంది ఒగ్గు పూజారులు తోటబావి వద్ద పెద్దపట్నం వేసే ప్రదేశంలో కొత్త గొంగడిలో బియ్యం పోసి పూజలు చేశారు.
అనంతరం పసుపు, కుంకుమ, తెల్లపిండి, పచ్చ, గులాలుతో 41 వరుసల్లో పెద్దపట్నం వేయడం ప్రారంభించగా.. తెల్లవారుజామున ముగిసింది. అనంతరం ఒగ్గు పూజారులు ఊరేగింపుగా వెళ్లి మల్లికార్జున స్వామి బోనాలు తీసుకొని పెద్దపట్నం వద్దకు వచ్చారు. అలాగే ఆలయ అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పెద్దపట్నం వద్దకు చేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆ విగ్రహాలతో పెద్దపట్నాన్ని దాటారు. పెద్దపట్నాన్ని దాటేందుకు భక్తులు వేలాదిగా తరలిరావడంతో కాస్త తోపులాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు గాయపడ్డారు.