కొమురవెల్లి మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. నెల రోజుల్లో రైలు సౌకర్యం అందుబాటులోకి..

కొమురవెల్లి మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. నెల రోజుల్లో రైలు సౌకర్యం అందుబాటులోకి..

సిద్దిపేట, వెలుగు: మల్లన్న ఆలయానికి వచ్చే భక్తులకు నెల రోజుల్లో రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది. మెదక్ జిల్లా మనోహరాబాద్, కరీంనగర్ జిల్లా కొత్త పల్లి వరకు 151 కిలోమీటర్ల  రైల్వే లైన్లో భాగంగా కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ను నిర్మిస్తున్నారు. 

రాజీవ్ రహదారి కొండపాక గేట్ నుంచి 2 కిలో మీటర్ల దూరంలోని  రైల్వే అండర్ పాస్ సమీపంలో  ఏడాది కింద  ప్రారంభించిన  రైల్వే స్టేషన్ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. మరో నెల రోజుల్లో  ప్రారంభానికి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  కొమురవెల్లిలో  రైల్వే స్టేషన్  ప్రారంభమైతే  హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల ప్రయాణ కష్టాలు తొలగిపోతాయి. 

స్టేషన్లో సకల సౌకర్యాలు

కొమురవెల్లికి  3 కిలో మీటర్ల దూరంలో ఏర్పాటవుతున్న స్టేషన్ లో సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. అర ఎకరం స్థలంలో  400  మీటర్ల ప్లాట్ ఫామ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కొండపాక వైపు మాత్రమే  నిర్మిస్తుండగా భవిష్యత్​లో మరో రైల్వే ట్రాక్  నిర్మాణం చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్టేషన్ బిల్డింగ్, వెయిటింగ్ హాల్, షెల్టర్ సీటింగ్, టికెట్ కౌంటర్లతో పాటు ప్రయాణికులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ తోపాటు ప్యాసింజర్ వెయిటింగ్ హాల్, టికెట్ కౌంటర్, ఫ్లాట్ పామ్ పనులు తుది దశకు చేరుకోగా స్టేషన్ నుంచి ఆలయానికి వెళ్లే మెయిన్ రోడ్డుకు ప్రత్యేకంగా సీసీ  రోడ్డు వేస్తున్నారు.

స్టేషన్ నిర్మాణంపై ఆలస్యంగా నిర్ణయం

మనోహరాబాద్ నుంచి కొత్త పల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా మొదట లకుడారం వద్ద రైల్వే స్టేషన్ ను నిర్మించారు. దీంతో భక్తులు లకుడారం స్టేషన్ నుంచి కొమురవెల్లికి చేరుకోవాలంటే 12 కిలో మీటర్ల దూరం ఆటోల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  కొమురవెల్లి వద్ద స్టేషన్  ఏర్పాటుకు సాంకేతిక సమస్య అడ్డంకిగా  మారడంతో స్థానికులు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, గవర్నర్​ను కలిసి సమస్య గురించి విన్నవించారు.

స్పందించిన నేతలు రైల్వే అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో టెక్నికల్ కమిటీ ప్రత్యేక పరిశీలన జరిపి  స్కిప్పర్ గ్రేడ్ లో ఉన్న ప్రదేశాల్లో స్పెషల్ సేఫ్టీ మెజెర్స్ తో  స్టేషన్  ఏర్పాటుకు అనుమతిచ్చింది. గతేడాది ఫిబ్రవరిలో స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనుకున్న విధంగా పనులు జరిగితే వచ్చే నెల రోజుల్లో కొమురవెల్లి రైల్వే స్టేషన్ ను ప్రారంభిస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు.