- నిధుల రికవరీపై మీన మేషాలు
- పైళ్ల మాయంతో తెరపైకి రికవరీ అంశం
- ఐదేండ్లుగా చర్యలు పెండింగ్ లోనే
సిద్దిపేట, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ నిధుల వినియోగంపై ఐదేండ్ల కింద అడిట్ అభ్యంతరాలను వ్యక్తం చేసినా సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకోకపోవడం చర్చానీయాంశంగా మారుతోంది. 2014 నుంచి 2017 వరకు దాదాపు 3.5 కోట్ల రూపాయల ఖర్చులకు సంబంధించి ఆడిటర్ లక్ష్మినారాయణ అవకతవకలను గుర్తించి నివేదిక సమర్పించారు.
దీని ఆధారంగా 2018లో 11 మంది ఉద్యోగులకు షోకాజు నోటీసులు జారీ చేసి వివరాలు కోరగా 2.30 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు. మిగిలిన 1.20 కోట్ల ఖర్చులకు ఎలాంటి ఆధారాలు చూపక పోవడంతో ఉద్యోగులపై చర్యలు తప్పవని అందరూ భావించారు. కానీ ఐదేండ్లు గడిచినా సదరు ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు నిధులను సైతం రికవరీ చేయలేదు.
ఫైళ్ల మాయంతో విషయం తెరపైకి
ఇటీవల మల్లన్న ఆలయంలో 1.20 కోట్ల ఆడిట్ అభ్యంతరాలకు సంబంధించిన ఫైళ్లు మాయం కావడంతో ఐదేండ్ల కింద జరిగిన అంశం తెరపైకి వచ్చింది. ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన సమయంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు ఫైల్స్ మాయంపై షోకాజు నోటీసులు జారీ చేశారు. ఇతర ఆలయాల్లో పనిచేస్తున్న ఈ ముగ్గురు ఉద్యోగులు ఆదరాబాదరగా మల్లన్న ఆలయానికి వచ్చి కనిపించకుండా పోయిన ఫైల్స్ ను వెతికి అప్పగించారని ఈవో తెలిపారు.
Also Read :- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సక్సెస్ ఫుల్‌గా వడ్ల కొనుగోళ్లు
2014 నుంచి 2017 వరకు మూడేళ్ల ఆదాయ వ్యయాలపై ఆడిటర్ క్షుణ్ణంగా పరిశీలన జరిపిన తర్వాతనే 1.20 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని గుర్తించారు. ఎంబీ రికార్డులు లేని మైనర్ మరమ్మతులకు రూ.70 లక్షలు, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రహరీ నిర్మాణానికి రూ.21 లక్షలు, ఒరిజనల్ బిల్లులు లేని ఉద్యోగుల అడ్వాన్స్ లు రూ.15 లక్షలు, అతిథుల భోజనాలకు రూ.5.34 లక్షలు, వాహనాల అద్దెకు రూ.4.56 లక్షలు, దుస్తుల కొనుగోలుకు రూ.14 లక్షలు, చెట్ల పెంపకానికి రూ.3.63 లక్షలు, వేలం బకాయిలు రూ.22 లక్షలు, నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకుల నుంచి డ్రా చేసిన రూ.33 లక్షల తో పాటు మరికొన్నింటిపై ఆడిటింగ్ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఐదేండ్లు గడిచినా ఆలయ పాలక వర్గాలు వీటిపై ఎలాంటి చర్చ జరపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.