యాదగిరిగుట్ట, కొమురవెల్లి ఆలయాలకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట, కొమురవెల్లి ఆలయాలకు పోటెత్తిన భక్తులు
  • యాదగిరిగుట్టలో ధర్మదర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట
  • ఆదివారం ఒక్క రోజే రూ.44.14 లక్షల ఆదాయం
  • కొమురవెల్లి ఐదో ఆదివారం జాతరకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు క్యూ కట్టారు. సెలవు రోజు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయలకు పరిసరాలు కిటకిటలాడాయి. రద్దీ కారణంగా కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, పార్కింగ్ ఏరియా, బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు.

మరో వైపు ఆలయంలో నిత్యపూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మొదలై రాత్రి పవళింపు సేవతో ముగిశాయి. భక్తులు జరిపించిన పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.44,14,051 ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయం ద్వారా అత్యధికంగా రూ.16,20,470 రాగా, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.5.25 లక్షలు, వీఐపీ దర్శనాలతో రూ.7.50 లక్షలు, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.1,78,400 ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు.

కొమురవెల్లిలో ఐదోవారం

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతరలో భాగంగా ఐదో ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మారుమోగింది. భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించిన అనంతరం కోనేరులో స్నానమాచరించి గంగరేణి చెట్టు, ముఖ మంటపం వద్ద పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మలతో కొలువైన మల్లన్నను దర్శించుకున్నారు. మల్లన్న గుట్టపై కొలువు దీరిన రేణుకఎల్లమ్మకు బోనాలు సమర్పించారు.

భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆఫీసర్లు ఏర్పాట్లు చేయగా, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి ఎపిటోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ అధినేత కాంత జైపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ -శ్రీవిద్య దంపతులు 14 కేజీల వెండితో తయారు చేయించిన తొడుగులను ఆలయ ఆఫీసర్లకు అందజేశారు. తల్లిదండ్రులు కాంత అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, -స్వర్ణలత, కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ధర్మకర్తల మండలి సభ్యులు లింగంపల్లి శ్రీనివాస్, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఉప ప్రధానఅర్చకులు సాంబయ్య పాల్గొన్నారు..