కోనసీమ జిల్లాను గోదావరి వరద చుట్టేసింది. కోనసీమ ప్రాంతంలో మెజార్టీ గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. అలాగే పంట పొలాలు కొట్టుకుపోయాయి. మరోవైపు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం కూడా అతాలకుతలం అయింది. చాలా గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. కొన్ని గ్రామాలకు బయట ప్రపంచంతో రాకపోకలు నిలిచిపోయాయి.
గోదావరి మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి 54 ( జులై 28 సాయంత్రం 5 గంటలకు)అడుగులకు చేరింది. దీంతో అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 15.30 అడుగులకు చేరింది. 175 గేట్లు ఎత్తి దిగువకు 15.36 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నారు. 9వేల క్యూసెక్కుల నీటిని తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టా కాల్వలకు విడుదల చేశారు. దీంతో లంక గ్రామాలన్నీ ముంపులో ( జులై 28 సాయంత్రం 5 గంటలకు)ఉన్నాయి.
కోనసీమ జిల్లాల్లో సఖినేటిపల్లి మండలంలో గ్రామాల్లోకి వరద నీరు ముంచెత్తుతోంది. ముమ్మిడివరం మండలం గురజాపులంక, లంక ఆఫ్ ఠానేలంక, కూనలంక, చింతల్లంక, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు, పి. గన్నవరం మండంలో శివాయలంక, చినకందపపాలెం గ్రామాల్లో ఇళ్లల్లోకి నీరు ప్రవహిస్తోంది. గ్రామాల్లో నీరు నడుంలోతు ఉంది. దీంతో ప్రజలకు కంటిమీద కునుకు లేదు.
ఆలమూరు మండలంలో బడుగువానిలంక, తోకలంక, అయినవిల్లి మండలంలో పుల్లపులంక, అయినవిల్లిలంక, శానిపల్లిలంక, పొట్టి లంకల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. రామచంద్రాపురం మండలం కోటిపల్లిలంక పూర్తిగా ముంపునకు గురవ్వడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కపిలేశ్వరపురం మండలం నారాయణలంక, కేదార్లంక, కోరుమిల్లి, అద్దంకివారి లంకల్లోని పంట పొలాల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
మామిడికుదురు మండలం అప్పనపల్లిలో బాలబాలాజీ ఆలయం రహదారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అప్పనపల్లి పాటురేవు ప్రాంతం చెరువుల్లో మత్స్య సంపద వరదనీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది
కోన సీమ జిల్లాల్లో ఆరు వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. కూరగాయల పంటలు, అరటి తోటలు, బొప్పాయి, పండ్లు తోటలు, పూల తోటలు, తమలపాకుల పంటలు వరద నీటికి కొట్టుకుపోయింది. లంక గ్రామాల్లోని కొబ్బరి తోటల్లోకి వరద చేరింది. చాలా గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నీట మునగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పశుగ్రాసం లేకపోవడంతో పశువులు అల్లాడిపోతున్నాయి. పశువులను పడవలపై తరలిస్తున్నారు.