తెలంగాణ ఉద్యమంలో తొలి తరం వీరుడు…

తెలంగాణ జెండాను ఎత్తిన తొలి తరం నేతల్లో కొండా లక్ష్మణ్​ బాపూజీ ఒకరు. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పదవులను గడ్డిపోచలా భావించారు. తొలి దశ ఉద్యమంలో హింసాకాండను నిరసించి, కాంగ్రెస్​ ప్లీనరీలో నిలదీశారు. కాసు కేబినెట్​ నుంచి తప్పుకుని ప్రత్యేక తెలంగాణకోసం మంత్రి పదవి వదులుకున్న మొదటి వ్యక్తిగా నిలిచారు. ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలను ఎదుర్కొని, తన నివాసం ‘జలదృశ్యం’లోనే ఎమ్మెల్యేలను కూడగట్టారు. ఈ జల దృశ్యమే మలి దశ పోరుకి వేదికయ్యింది.

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు రోజూ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేపట్టిండ్రు. వారిపై పోలీసులు, మలబార్​ నుంచి వచ్చిన మిలటరీ, గూర్ఖా రైఫిల్స్​ సైన్యం జరిపిన కాల్పుల్లో అభం శుభం ఎరుగని పిల్లలు, విద్యార్థులు అమరులయ్యిండ్రు. ప్రతి పాఠశాల, కళాశాల ఓపెన్​ ఎయిర్​ జైలుగా​ మారింది.

మంత్రి పదవిని త్యాగం చేసిన మొదటి వ్యక్తి

విద్యార్థులపై పోలీసుల కాల్పులకు నిరసనగా కొండా లక్ష్మణ్​ బాపూజీ కాంగ్రెస్​ పార్టీ ప్లీనరీలో గొంతు విప్పారు.   కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గం​లో ఉన్న ఆయన.. పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవి వదులుకున్న మొదటి వ్యక్తి కొండా లక్ష్మణ్​ బాపూజీ. 1969లో ఏర్పడ్డ తెలంగాణ ప్రజా సమితి యాక్షన్​ కమిటీకి​ బాపూజీ శాశ్వత ఆహ్వానితుడు. తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ​ బాపూజీ అధ్యక్షతన తెలంగాణ ప్రజా సమితి అనే రాజకీయ పార్టీగా మారింది. లోక్​సభ ఎన్నికల్లో పోటీ కూడా చేసింది.

తెలంగాణ రక్షణల కోసం తెగువ

1967లో బాపూజీ మంత్రి పదవి తీసుకున్నాక తెలంగాణ రక్షణలను అమలుచేయాలని సీఎంకి విన్నవించాడు. తెలంగాణతోపాటు వెనకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ కోసం మంత్రివర్గ ఉప సంఘం నియమించాలనే ప్రతిపాదన పెట్టిండు. దానికి ముఖ్యమంత్రి అంగీకరించలేదు. 1968లో ఎల్​డీసీ నియమాకం విషయంలో ముల్కీ నిబంధనలకు మినహాయింపు కోరుతూ నాటి కార్మిక శాఖ కమిషనర్​ సిఫారసు చేసిండు. హోంశాఖ సహాయ కార్యదర్శి సమర్ధిస్తూ కార్మిక మంత్రి బాపూజీకి పంపారు. దాన్ని ఆయన తిరస్కరించిండు. తెలంగాణలో అనేక మంది అర్హులు నిరుద్యోగులుగా కొట్టుమిట్టాడుతుంటే బయటి (ఆంధ్ర) నుంచి ఎట్లా వస్తారని ప్రశ్నించిండు. ఈ దొడ్డిదారి నియామకాలను 1968 జూన్​లో మంత్రి మండలి​ దృష్టికి తీసుకొచ్చిండు. మంత్రి మండలి పరిశీలనార్థం మెమో ప్రతిపాదించాడు. ముల్కీ నిబంధనల కేసులన్నింటినీ ఆపేయాలని, అన్ని శాఖలకు లేఖలు రాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరిండు. ఆ ఉద్యోగాలు తెలంగాణా అభ్యర్థులకు మాత్రమే ప్రత్యేకించబడినవని వాదించిండు.

మొదటి నుంచీ క్రియాశీలకంగానే..

తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ మొదటి నుంచీ క్రియాశీలకంగానే ఉన్నాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో విద్యార్థులు మృతి చెందుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అప్పటి చీఫ్ సెక్రెటరీ ఎం.టి.రాజు పక్షపాతంతో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వనరులు రాకుండా చేసిండ్రు. ఈ దశలో బాపూజీ రంగంలోకి దిగి ఆంధ్ర ప్రాంత నాయకులు పెద్ద మనుషుల ఒప్పందాన్ని గౌరవించాలని డిమాండ్​ చేసిండ్రు.

‘జలదృశ్యం’లో భేటీ

తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నపుడు బాపూజీ పూనుకొని తన నివాసం ‘జలదృశ్యం’లో కొంత మంది ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటుచేసిండు. తెలంగాణ ప్రాంతీయ కమిటీకి ఉండే ‘అటానమీ’ విషయంలో ముఖ్యమంత్రి ప్రతిసారీ మొకాలడ్డేవారు. రీజనల్ అటానమీ కన్నా ప్రత్యేక తెలంగాణ మంచిదని బాపూజీ అభిప్రాయం.

తెలంగాణ తప్ప ఏదీ వద్దు

మరోసారి చర్చల కోసం ఢిల్లీకి రావాలని అధిష్టానం 1969 ఏప్రిల్ మూడో వారంలో బాపూజీని ఆహ్వానించింది. తెలంగాణ తప్ప ఏదివ్వడానికైనా కేంద్రం సిద్ధంగా ఉందని మొరార్జీ దేశాయ్​ చెప్పిండు. బాపూజీ సమాధానమిస్తూ ‘నెహ్రూ ఇదే చెప్పిండు. ఇప్పుడాయన లేడు. అందుకే ప్రత్యేక తెలంగాణకు తప్ప దేనికీ ఒప్పుకోం’ అని తేల్చి చెప్పిండు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను తెలియజేస్తూ బుక్​లెట్​ ముద్రించి ఫరీదాబాద్ ప్లీనరీలో అందించిండు. దాన్నే ‘తెలంగాణ సంగతి’ పేరిట వెలువరించిండు.

ఉద్యమం చారిత్రక మలుపు

బాపూజీ 1969 మార్చి 27న తన రాజీనామాను ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి అందజేసిండు. దాన్ని ఆమోదిస్తున్నట్లు సీఎం ప్రకటించిండు. ఈ రాజీనామా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఒక చారిత్రక మలుపు తిప్పిందని చెప్పవచ్చు. రాజీనామా చేసి హైదరాబాద్​కు చేరుకున్న బాపూజీకి విద్యార్థులు, ఉద్యమకారులు బేగం పేట ఎయిర్ పోర్ట్​లో ఘన స్వాగతం పలికిండ్రు. అక్కడి నుంచి జలదృశ్యం వరకు భారీ ర్యాలీని నిర్వహించిండ్రు. మార్గమధ్యంలో అనేక చోట్ల సన్మాన సభలు ఏర్పాటుచేసిండ్రు. బాపూజీ రాజీనామాతో మిగతా మంత్రులపై ఒత్తిడి పెరిగింది. విద్యార్థులు, రాజకీయ నాయకులు ప్రత్యేక తెలంగాణ డిమాండ్​కు మద్దతు ప్రకటించి తెలంగాణ ప్రజా సమితి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని బాపూజీని కోరిండ్రు. 1969 ఏప్రిల్ 10న ఎనిమిది సూత్రాల పథకాన్ని ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించారు. అదే రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప బెంగుళూరు వెళుతూ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో బాపూజీతో ఈ పథకం పై చర్చలు జరిపిండు. ఆ పథకంతో తెలంగాణకు మేలు జరగదని బాపూజీ.. నిజలింగప్పకు తేల్చిచెప్పిండు.

ప్రభుత్వంలో ఉన్నా తగ్గలేదు

బాపూజీ వాదనకు తలొగ్గిన ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ‘నాన్ ముల్కీ ఉద్యోగులందరినీ మూడు నెలల్లో తొలగించడానికి 1968 జూలై 6న నిర్ణయించారు. జూలై 10న ఉత్తర్వులు వెలువడ్డాయి. మిగులు నిధుల విషయంలో కూడా బాపూజీ కేబినెట్​లో కొట్లాడిండు. 1967లో.. తెలంగాణకు కేటాయిస్తున్న నిధులపై మంత్రివర్గ ఉప సంఘం నియమించాలని డిమాండ్ చేసిండు. 1968లో మరోసారి నిధుల విషయాన్ని తేల్చాలని డిమాండ్ చేసిండు. మూడో ప్రణాళికా కాలం(1961–-66లో) మిగులు నిధులు రూ.30 కోట్లని సీఎం చెప్పిండ్రు. బాపూజీ సంతృప్తి చెందకుండా పూర్తి వివరాలు అడిగిండు. తెలం గాణకు ఉద్యోగాలు, నిధుల్లో జరుగుతున్న అన్యాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు బాపూజీ సొంత ప్రభుత్వంపైనే ప్రతిపక్షం కన్నా ఎక్కువగా పోరాడిండు. బాపూజీని 1969 జూన్ 24న అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించిండ్రు.

(ఇవాళ కొండా లక్ష్మణ్​ బాపూజీ జయంతి)

– సంగిశెట్టి శ్రీనివాస్