తెలంగాణ ఉద్యమం కోసం ఆయన పదవినే త్యాగం చేసిండు: శ్రీనివాస్ గౌడ్

  • జలదృశ్యం వద్ద లక్ష్మణ్ బాపూజీ జయంతి  

ముషీరాబాద్/బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణ సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ అనునిత్యం కృషి చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం తన పదవిని కూడా త్యాగం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. బుధవారం హైదరాబాద్​లోని జలదృశ్యం వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో  కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్యమైన పాత్ర పోషించారని చెప్పారు. ‘‘కొండా లక్ష్మణ్ బాపూజీ.. అసలైన తెలంగాణ వాది. ఆయన ఆశయాలను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారు. చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు” అని తెలిపారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. టీజేఎస్ చీఫ్ కోదండరాం మాట్లాడుతూ.. చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత లక్ష్మణ్ బాపూజీ కే దక్కుతుందన్నారు. ఆయన మూడు తరాల ఉద్యమ యోధుడు అని, ఆయనను అందరూ గౌరవించుకోవాలన్నారు. బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధనే లక్ష్యంగా లక్ష్మణ్ బాపూజీ పోరాటం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్లు అమలైనప్పుడే న్యాయం

చట్టసభల్లో మహిళల రిజర్వేషన్​తో పాటు బీసీ రిజర్వేషన్లు అమలు జరిగినప్పుడే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రవీంద్ర భారతిలో నిర్వహించిన బాపూజీ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవిని త్యాగం చేసి బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఉద్యమాలు  చేశారని తెలిపారు.