సిద్దిపేట, వెలుగు: కొత్త హైబ్రిడ్ వంగడాల రూపకల్పనపై ప్రత్యేక ప్రణాళికలను రూపొందిచడమే కాకుండా రానున్న మూడేండ్లలో ఈ పనులు స్పీడప్ చేసి ఫలితాలను రాబడతామని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ నూతన వైస్ చాన్స్ లర్ దండ రాజిరెడ్డి వెల్లడించారు. "అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని క్షేత్రస్థాయిలో బోధన అందించడమే కాకుండా స్టూడెంట్స్, రైతులకు సంపూర్ణ సహకారం అందిస్తాం.
నిత్య జీవితంలో మానవ ఆహార సరళి మారడంతో కూరగాయలు, పండ్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతున్నందున మార్కెట్ అవసరాలకు అనుగుణంగా హార్టికల్చర్ ప్రొడక్ట్ ను పెంచాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ నష్టాలను హార్టికల్చర్ పంటల సాగుతో కొంత మేర తగ్గించడానికి అవకాశం ఉంది. యూనివర్సిటీలో సమస్య లను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతాం" అని చెప్పారు.
ఉద్యానవన పంటల సాగు పెంపు
-ప్రస్తుతం రాష్ట్రంలో 12 లక్షల విస్తీర్ణంలో ఉద్యాన పంటల సాగు జరుగుతోంది. దీన్ని మరింతగా పెంచే దిశగా చర్యలు తీసుకుంటాం. వరి, పత్తి పంటల సాగు తగ్గించి రైతులు ఉద్యానవన పంటల సాగుపై దృష్టి పెట్టే విధంగా అవగాహన కల్పిస్తూ క్రమంగా డెవలప్ చేస్తాం. వాతావరణ పరిస్థితుల ప్రకారం ఆయా ప్రాంతాల్లో కూరగాయలు సాగు పెంచడానికి విత్తనాలను సరఫరా చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కూరగాయలు, పండ్లు, పూలసాగుతో ఆదాయాన్ని పెంచుకోవచ్చని గ్రామాల్లో రైతులకు వివరిస్తాం.
స్టూడెంట్ రీసెర్చ్ పై ఫోకస్
హార్టికల్చర్ వర్సిటీలో చదివే స్టూడెంట్స్రీసెర్చ్ వైపు దృష్టి పెట్టేలా ఫోకస్ చేస్తున్నాం. వర్సిటీలో అత్యాధునిక ల్యాబ్ అందుబాటులో ఉండగా రానున్న రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ ఇన్సిట్యూట్స్ తో ఒప్పందం చేసుకుని స్టూడెంట్స్ను రీసెర్చ్ వైపు మొగ్గు చూపేలా చేస్తాం. ప్రభుత్వం హార్టికల్చర్ పంటల సాగుపై ఎంతో ఆసక్తి చూపుతోంది వారి అంచనాల ప్రకారం ముందుకు సాగుతాం.
హార్టికల్చర్ సాగుతో నెట్ ప్రాఫిట్
హార్టికల్చర్ పంటలైన పూలు, పండ్లు, కూరగాయల సాగు వల్ల రైతుకు నెట్ ప్రాఫిట్ లభిస్తుంది. నీటి లభ్యత తక్కువగా ఉన్నా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని హార్టికల్చర్ పంటల సాగు ద్వారా పొందవచ్చు. ఈ విషయాన్ని రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. పండ్లు, పూలు, కూరగాయల సాగు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. పట్టణాల చుట్టూ కూరగాయల సాగును ప్రొత్సహిస్తే రైతుకు లాభం, సెల్ప్ సఫిసియెన్సీ రావడమే కాక మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను అందించడానికి అవకాశం ఉంటుంది.
హైబ్రిడ్ రకాలపై రీసెర్చ్
హార్టికల్చర్ వర్సిటీ తరపున హైబ్రిడ్ వంగడాల రూపకల్పన కోసం రీసెర్చ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఎంపిక చేసిన సైంటిస్టులను ఇతర ప్రాంతాలకు శిక్షణ కోసం పంపించాలని నిర్ణయించాం. గతంలో కొత్త వంగడాల రూపకల్పనకు ఎక్కువ సమయం పట్టేది, ప్రస్తుతం తక్కువ సమయంలోనే కొత్త వంగడాల రూపకల్పన, రీసెర్చ్ కు ప్రాధాన్యం ఇస్తున్నాం. మోడ్రన్ బయో టెక్నాలజీని ఉపయోగించి సీడ్ బ్రీడింగ్ తో నాణ్యమైన దిగుబడులను ఇవ్వడమే కాకుండా పురుగులను తట్టుకునే వంగడాలను రూపొందిస్తాం. మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉన్న టమాట, దోసతోపాటు ఎక్కువగా వినియోగించే ఇతర కూరగాయల హైబ్రిడ్ వంగడాలను తయారు చేస్తాం. బయోటెక్నాలజీతో పాటు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి హార్టికల్చర్ పంటలు రోగాల బారిన పడకుండా జీన్స్ ను అభివృద్ధి చేస్తాం.
పూల సాగుకు పెరుగుతున్న డిమాండ్
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పూల సాగు జరగకపోవడం వల్ల మార్కెట్ లో డిమాండ్ బాగా పెరుగుతోంది. డిమాండ్ ఉన్న పూల సాగు పెరగడానికి హార్టికల్చర్ వర్సిటీ తరపున ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. వీటితో పాటు నిత్యజీవితంలో పండ్ల వినియోగం పెరడం వల్ల స్థానికంగా వాటి ఉత్పత్తి పెంచాలనే నిర్ణయం తీసుకున్నాం.
వర్సిటీ విస్తరణకు చర్యలు
హార్టికల్చర్ వర్సీటీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింప జేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికి మహబూబాబాద్ లో కొత్తగా హార్టికల్చర్ కాలేజీని నాగర్ కర్నూల్ జిల్లాలో హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పాటు చేశాం. హార్టికల్చర్ కాలేజీలు, పాలిటెక్నిక్, రిసెర్చ్, కృషి విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుండడమే కాకుండా కేవీకేలతో గ్రామాల్లో రైతులకు టెక్నాలజీ అంశాలను వివరిస్తాం. వర్సిటీలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్జరుగుతుంది. మరిన్ని పోస్టులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వర్సిటీ నిర్వహణకు అదనంగా నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరగా సానుకూలంగా స్పందించింది.