వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సినిమాతో ప్రేక్షకులను అలరిందుకు సిద్దమయ్యాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు కొండా మురళీధర్, సురేఖల జీవిత కథను సినిమా రూపంలో తెరకెక్కించారు. 1990లో నక్సలైట్ బ్యాక్ డ్రాప్లో స్టోరిని కల్పిత కథగా మార్చి రూపొందించారు. ఈ చిత్రానికి స్టోరీ , స్క్రీన్ ప్లే , డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తాజాగా కొండా మూవీ రెండో ట్రైలర్ను విడుదల చేశారు.
1990లో కారుపై జరిగిన దాడి సన్నివేశంతో ఈ ట్రైలర్ మొదలవుతుంది. పెత్తందార్ల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి అంటూ ఆర్జీవీ చెప్పే డైలాగ్ ఆసక్తిని క్రియేట్ చేసింది. విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని కార్ల్ మార్క్స్ 180 ఏళ్ల క్రితం చెప్పారు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్య నుంచే పుట్టిన వాడే కొండా మురళీ అంటూ వర్మ ట్రైలర్‌లో హీరో పాత్రను పరిచయం చేశారు. ఈసారి కొట్టా, చంపేస్తా, ఆలోచనలు ఉంటే సరిపోదు స్వేచ్ఛ, బానిసత్వం, మనం చేసే పోరాటల గురించి కూడా తెల్వాలే అనే డైలాగ్‌లు ట్రైలర్లో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా జూన్ 23న విడుదల కానుంది.
మురళి, సురేఖ క్యారెక్టర్లు నాకు స్పెషల్ అనిపించాయి..
విజయవాడ రౌడీయిజం, రాయలసీమ ఫ్యాక్షనిజం మీద సినిమాలు తీశానని..కానీ తెలంగాణపై తనకు అవగాహన లేదన్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అయితే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది గురించి విన్నానని చెప్పుకొచ్చాడు. అప్పుడు కొండా మురళి పేరు ప్రత్యేకంగా అనిపించిందని తెలిపారు. తాను రియలిస్టిక్, రస్టిక్ సినిమాలు తీశానన్న వర్మ... మురళి, సురేఖ క్యారెక్టర్లు తనకు స్పెషల్ గా అనిపించాయన్నారు. అంతకు ముందు అటువంటి పాత్రల గురించి వినలేదు, చదవలేదు, చూడలేదన్నారు ఆర్జీవ. వాళ్ళ గురించి తెలిశాక... సినిమా తీయాలని రీసెర్చ్ చేశానని...అందులో భాగంగానే కొండా ఫ్యామిలీని కలిశానన్నారు. తన తల్లిదండ్రుల కథ కాబట్టి తానే ప్రొడ్యూస్ చేస్తానని కొండా దంపతుల కుమార్తె సుష్మితా పటేల్ చెప్పడంతో.. హ్యాపీ అనిపించిందన్నారు.