వరంగల్ సిటీ, వెలుగు: కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని, ఇతర పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుడు కరాటే ప్రభాకర్ బర్త్ డే సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండా దంపతులు కాంగ్రెస్ లోనే కొనసాగుతారని, ప్రతి కార్యకర్తనూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు.
కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచే పోటీ చేస్తారని, తొందర్లోనే ఎంజీఎం ఆసుపత్రి నుంచి పాదయాత్ర కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి కార్యకర్తల బాధలో పాలుపంచుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన కొంతమంది యువకులు కాంగ్రెస్ లోకి చేరగా.. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.