మైసమ్మ సాక్షిగా చెప్తున్న.. ధర్మారెడ్డిని ఓడిస్తా : కొండా మురళి

మైసమ్మ సాక్షిగా చెప్తున్న.. ధర్మారెడ్డిని ఓడిస్తా : కొండా మురళి

మైసమ్మ సాక్షిగా చెప్తున్న.. ధర్మారెడ్డిని ఓడిస్తా 
ఎవరు ఎవరిని తరుముతారో తేల్చుకుందాం
డేట్, టైం నువ్వే చెప్పు.. ఎక్కడికంటే అక్కడికి వస్తా
పార్టీ అవకాశం ఇస్తే  పరకాల నుంచి పోటీ చేస్తా
భయపడటం అనేది మా వంశంలోనే లేదు
ఎమ్మెల్యే చల్లాకు కొండా మురళి సవాల్

వరంగల్ : ‘మైసమ్మ సాక్షిగా చెప్తున్నా.. పరకాలలో ధర్మారెడ్డిని ఓడించి తీరుతా..’అని కొండా మురళి అన్నారు. ‘పరకాలలో ఉంటా.. వరంగల్ తూర్పులో ఉంటా దమ్ముంటే కాచుకో’ అంటూ చల్లా ధర్మారెడ్డికి సవాల్ విసిరారు. ఎవరు ఎవరిని తరుముతారో తేల్చుకుందా వస్తావా..? అని ప్రశ్నించారు. డేట్, టైం నువ్వే చెప్పు.. ఎక్కడికంటే అక్కడికే వస్తా.. అంటూ సవాల్ విసిరారు. ఇవాళ వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే పరకాల నుంచి పోటీ చేస్తానని చెప్పారు.

ధర్మారెడ్డి అంతు తేలుస్తానని అన్నారు. బుల్లెట్లకు ఎదురొడ్డి నిలబడ్డ కొండా మురళి ఎప్పటికీ భయపడబోడని చెప్పారు. ధర్మారెడ్డి మట్టిదొంగ అని, ఆయన అరాచకాలు భరించలేకే చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు తన వద్దకు వస్తున్నారని అన్నారు.  ధర్మారెడ్డి.. కేటీఆర్ చెప్తేనే మీడియాతో మాట్లాడాడని అన్నారు. ‘నా భాష బాగాలేదట.. నేనేమైనా ఛత్తీస్ గఢ్​ గోండు బిడ్డనా..? నేను సన్నాసుల కాళ్లు మొక్క.. చెంచాగిరీ అనేది బీఆర్ఎస్ పార్టీలోనే పుట్టింది. నాకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి..అహంకారపు మాటలు మానుకోకపోతే నిన్ను తరిమి కొడ్తం’అంటూ తనదైన స్టైల్లో స్పందించారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.