
సంగారెడ్డి, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ కట్టిందని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. శనివారం సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు ఓటెయ్యలో ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. సిట్టింగ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ గెలిచి సీఎం రేవంత్ కి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరారు. మంత్రి దామోదర మాట్లాడుతూ..14 నెలల్లో 56 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ కొనసాగుతుందన్నారు. ఆరోగ్యశాఖలో 7,500 ఉద్యోగాలు ఇచ్చినట్టు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి కోరారు. సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు, తోపాజి అనంత కిషన్ పాల్గొన్నారు.
మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలిపేందుకు కృషి చేస్తా : మంత్రి దామోదర
మెదక్: మెదక్ జిల్లా సిరిసిల్ల జోన్లో ఉండడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని ఈ ప్రాంత నిరుద్యోగులు, ఉద్యోగులు చెబుతున్నారని ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి చార్మినార్‌జోన్‌లో కలిపేందుకు కృషి చేస్తానని మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెదక్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు.
జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి ఏటా ఏప్రిల్, మే నెలల్లో నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న నరేందర్‌రెడ్డి 30 ఏళ్లుగా విద్యారంగంలో సేవలందిస్తున్నారని చెప్పారు. జిల్లా ఇన్ చార్జి మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. బిజినెస్ చేసే బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, విద్యా వ్యవస్థపై పూర్తి అవగాహన ఉన్న నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే పట్టభద్రులకు మేలు కలుగుతుందన్నారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావుమాట్లాడుతూ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల పక్షాన నిలుస్తానన్నారు.
సమావేశంలో క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్దీపక్జాన్, డీసీసీ ప్రెసిడెంట్ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్, దుబ్బాక సెగ్మెంట్కాంగ్రెస్ ఇన్చార్జిలు ఆవుల రాజిరెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్అధ్యక్షుడు పరుశరాం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫిజొద్దీన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవాని, పార్టీ నాయకులు సుప్రభాతరావు, ఆంక్షారెడ్డి, చంద్రపాల్, జీవన్‌రావు, శ్రీనివాస్‌చౌదరి, పవన్, రాజేశ్, వెంకటరమణ, మేకల రవి పాల్గొన్నారు.
క్రాస్ ఓటింగ్ కు కుట్ర : మంత్రి సురేఖ
సిద్దిపేట: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకుని ఎంపీ ఎన్నికల్లో చేసినట్టుగా క్రాస్ ఓటింగ్ కు కుట్ర పన్నుతున్నాయని ఈ విషయంలో కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని శక్తి గార్డెన్ లో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొని మట్లాడారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ పై ఎందుకు మాట్లాడడం లేదో అర్థమవుతోందన్నారు. ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చి సత్తా చూపుతానన్న కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాండెంట్ ను ఎందుకు నిలబెట్టలోదో చెప్పాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ఒక్క సంవత్సరంలో 56 వేల మందికి ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్ సర్కార్ కే దక్కిందని, సీఎం రేవంత్ రెడ్డి మరో రెండు లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నారని వివరించారు.
కేసీఆర్ లాగా సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌజ్ లో రెస్ట్ తీసుకోకుండా 24 గంటలు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, సిద్దిపేట కాంగ్రెస్ ఇన్చార్జి పూజల హరికృష్ణ, దుబ్బాక కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.