కేసీఆర్​ ఫ్యామిలీకి ఊచలే : కొండా సురేఖ

కొండా మురళి ఫోన్​ను ఎర్రబెల్లి ట్యాపింగ్‍ చేయించిండు
విచారణలో అన్నీ బయటకు వస్తయ్​: కొండా సురేఖ

వరంగల్‍/వరంగల్‍ సిటీ, వెలుగు :  లిక్కర్​, కాళేశ్వరం, ఫోన్‍ ట్యాపింగ్‍ కేసుల్లో కేసీఆర్‍ కుటుంబం ఊచలు లెక్కించక తప్పదని మంత్రి కొండా సురేఖ అన్నారు. తన భర్త కొండా మురళి ఫోన్‍ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు ట్యాప్‍ చేయించారని ఆరోపించారు. కేసు విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. గత బీఆర్‍ఎస్‍ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్షల కోట్లు ఆగం చేసిందని, మేడిగడ్డను కూలగొట్టాలని నిపుణులు చెప్తున్నారని పేర్కొన్నారు. బుధవారం వరంగల్‍ తూర్పు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి.. ఓసిటీలో క్యాంప్‍ ఆఫీస్​ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో కేటీఆర్ బండారం బయటకు వస్తున్నదన్నారు. వరంగల్‌‌లో వర్షం కురిస్తే కాలనీలన్ని మునిగిపోయే పరిస్థితి ఉండేదని, ఇక నుంచి లోతట్టు ప్రాంతాల్లో కూడా వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వరంగల్​లో ఆక్రమణకు గురైన దేవుడి మాన్యాలను సర్వే చేయిస్తామని, దేవుళ్ల పేరుతోనే  పాస్‍బుక్‍లు తయారు చేపించడం ద్వారా భవిష్యత్‍లో ఆలయ భూములు మరోసారి ఆక్రమణలకు గురవ్వకుండా చూస్తామన్నారు.

ఖిలా వరంగల్‍తో పాటు పురాతన ఆలయాలు డెవలప్‍ చేస్తామని చెప్పారు. 2025లో కొండా మురళి ఎమ్మెల్సీ అవుతారని, తన కూతురు సుస్మిత పటేల్‍ కూడా లీడర్‍గా ఎదుగుతుందని తెలిపారు. కాంగ్రెస్‍ హైకమాండ్‍ పరకాల సీటు ఆఫర్‍ చేసినప్పటికీ.. తాము ప్రిపేర్‍ కాలేదు కాబట్టి వదులుకున్నామని చెప్పారు. లోక్​సభ ఎన్నికల్లో పార్టీలోని పాతోళ్లు, కొత్తోళ్లు కలిసి పనిచేయడం ద్వారా భారీ మెజార్టీ వచ్చేలా చూడాలని నేతలకు సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తదితరులు పాల్గొన్నారు.