సమగ్ర సర్వేలో మంత్రి కొండా సురేఖ వివరాల నమోదు

హైదరాబాద్, వెలుగు : సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా మంత్రి కొండా సురేఖ తన వివరాలు నమోదు చేయించుకున్నారు. శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆమె వివరాలు ఇచ్చారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి, సూపర్ వైజర్ గంగాధర్, ఎన్యుమరేటర్ రమేశ్ ఈ సర్వేలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సురేఖ సర్వే పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం మేరకు వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చేపట్టిన ఈ మహా యజ్ఞం విజయవంతమయ్యేలా  సహకరించాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.