
సర్కార్ బడిలోనే నాణ్యమైన విద్య అందుతుందని మంత్రి కొండా సురేఖ చెప్పారు. విద్యార్థులకు నాణ్యతమైన విద్య, ఆహారం అందించాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటేనే... పిల్లలు బాగా చదువుతారని అనుకోవద్దని.. చదువుకోవాలని ఆసక్తి ఉన్న వారు.. ఎక్కడైనా చదువుతారన్నారు. జూన్ 12వ తేదీ ఖిలా వరంగల్ ఆరేళ్లి బుచ్చయ్య స్కూల్లో నిర్వహించిన బడి బాట కార్యక్రమములో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన మంత్రి సురేఖ.. విద్యార్ధులకు యూనిఫాం, పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించే బాధ్యత మహిళలదేనన్నారు. తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని... మన కలెక్టర్ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివారని చెప్పారు. పాఠశాలల్లో త్వరలో సెమీ రెసిడెన్షల్ విధానానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉందని తెలిపారు.
మహిళ సంఘాలకే పాఠశాల బాధ్యతలు అప్పగించామని ఆమె చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలు తయారు చేయాలనే ఆశయంతో ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉండి కాపీటిషన్ పరీక్షలు రాయించాలని సూచించారు. ప్రభుత్వం పాఠశాలకు సంబంధించిన పెండిగ్ బిల్లులను ఎప్పటికీకప్పుడు అందజేస్తామని మంత్రి చెప్పారు.