టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా

వరంగల్ జిల్లా :  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కొండా సురేఖ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.  తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏఐసీసీ వేసిన తెలంగాణ ప్రదేశ్ కమిటీలు తనకు అసంతృప్తిని కలిగించాయని తెలిపారు.  తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తన పేరు లేకపోవడం, వరంగల్ జిల్లాకు చెందిన ఏ ఒక్క లీడర్ పేరు లేకపోవడం  మనస్థాపాన్ని కలిగించిందన్నారు. 

తెలంగాణ ప్రదేశ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తన కంటే జూనియర్లను నామినేట్ చేశారని ఆరోపించారు. తనను  మాత్రం తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా నియమించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు.  తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లో తనను నియమించడాన్ని అవమానపరిచినట్టుగా భావిస్తున్నానని తెలిపారు.  ‘‘ నాకు పదవులు ముఖ్యం కాదు.. ఆత్మాభిమానం ముఖ్యం.. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ సామాన్యకార్యకర్తలా కొనసాగుతాను’’ అని  మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ స్పష్టం చేశారు.