
బీఆర్ఎస్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంత్రి కొండా సురేఖ. గతంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇందిరమ్మ గెలిచారని.. మరోసారి ఈ గడ్డపై కాంగ్రెస్ విజయ ఢంకా మోగించాలన్నారు ఆమె. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార రథాలను రుద్రారం గణేష్ దేవస్థానం దగ్గర మంత్రి పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు.
అనంతరం కొండా సురేఖ మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంట్ ఛాలెంజ్ గా తీసుకున్నామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు ఉన్నటువంటి ఈ మెదక్ జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆరుగ్యారెంటీ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కష్టపడాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో మెద క్ ఎంపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను తనకు అప్పగించారని.. ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. రేపటినుండి ప్రచారం ముమ్మరం చేస్తామని, ఎన్నికలలో విజయకేతనం ఎగురవేసి సంబురాలు జరుపుకునేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి కొండా సురేఖ అన్నారు.