సినీ నటుడు నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబం సహా సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఒక అడుగు వెనక్కి వేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
మీరు ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం
తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ, అక్కినేని నాగ చైతన్య, సమంతల మనోభావాలను దెబ్బతీయడం కాదని కొండా సురేఖ తన ట్వీట్ లో పేర్కొన్నారు. స్వయం శక్తితో వారు ఎదిగిన తీరు అందరికీ ఆదర్శమని కొనియాడారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ, అక్కినేని కుటుంబం కానీ, వారి అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే, బేషరతుగా తన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. అన్యద భావించవద్దని పేర్కొన్నారు.
నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ @Samanthaprabhu2 మనోభావాలను దెబ్బతీయడం కాదు.
— Konda surekha (@iamkondasurekha) October 2, 2024
స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా..
కేటీఆర్‌పై వెనక్కి తగ్గేది లేదు.
అదే సమయంలో కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉంటానని కొండా సురేఖ తేల్చి చెప్పారు. కేటీఆర్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పంపిన నోటీసులపై లీగల్‌గా ముందుకు వెళ్తానని ఆమె తెలిపారు.