
హైదరాబాద్, వెలుగు: నటుడు అక్కినేని నాగార్జున, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసుల్లో మంత్రి కొండా సురేఖ గురువారం నాంపల్లి కోర్టుకు వచ్చారు. ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శ్రీదేవి ముందు విచారణకు హాజరయ్యారు. ఈ రెండు కేసుల్లో తదుపరి విచారణను జడ్జి ఈ నెల 27 కు వాయిదా వేశారు.
గతేడాది గాంధీ జయంతి రోజున లంగర్‌హౌస్ లోని బాపూఘాట్ వద్ద కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ..నాగార్జున కుటుంబంతో పాటు కేటీఆర్‌పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున, కేటీఆర్ విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు.
ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ రెండు కేసులు విచారణ జరుగుతున్నాయి. గతంలో కొండా సురేఖ విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. దీంతో తన న్యాయవాదితో కలిసి కోర్టులో హాజరయ్యారు.