మా పాలనలోప్రొటోకాల్ సమస్య ఉండదు : కొండా సురేఖ

మా పాలనలోప్రొటోకాల్ సమస్య ఉండదు : కొండా సురేఖ

సంగారెడ్డి, వెలుగు :  ప్రజాపాలన సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రి కొండా సురేఖ మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాపాలన రివ్యూ మీటింగ్ లో రేషన్ కార్డులు, ఎమ్మెల్యేల ప్రొటోకాల్ అంశంపై దుబ్బాక, నర్సాపూర్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతారెడ్డి మంత్రికి వివరిస్తుండగా వారి మధ్య ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ‘‘బీఆర్ఎస్ పాలనలో దుబ్బాక నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేశాం. ఇప్పుడు ఆ లబ్ధిదారులకు మీరు రేషన్ కార్డులు ఇవ్వాలి

 అని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మంత్రిని కోరగా అందుకు స్పందించిన మంత్రి ‘‘మీ పాలన అట్లా సాగింది’’ అని చురక అంటించారు. లబ్ధిదారులకు కాకుండా మీ పార్టీ అనుచరులకు, అభిమానులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారని, కానీ వారికి రేషన్ కార్డులు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. తర్వాత సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ ఫ్రీ బస్సు జర్నీ  అనేక ఇబ్బందులకు దారితీస్తోందన్నారు. ఆర్టీసీ సేవలను మరింతగా పెంచి అందరికీ సౌకర్యంగా ఉండేలా చూడాలని మంత్రిని కోరారు.  

మంత్రి స్పందిస్తూ అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న విషయం వాస్తవమేనని, ఆర్టీసీ సేవలను మరింత పెంచేలా ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ సమస్య ఎదురవుతోందని, ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. మంత్రి బదులిస్తూ కాంగ్రెస్ పాలనలో ప్రొటోకాల్ సమస్య ఉండదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే ప్రొటోకాల్ సమస్యలు తలెత్తాయని గుర్తుచేశారు.