వికారాబాద్/పరిగి, వెలుగు: చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాన్ని భవిష్యత్తులో అత్యుత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన బీజేపీవైఎం యువ సమ్మేళనంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.
తనను ఎంపీగా గెలిపిస్తే చేవెళ్ల పరిధిలోని యువతీయువకులకు ఉపాధి మార్గం చూపిస్తానని, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను ఎంపీగా ఉన్నటైంలో అనేక స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్నిర్వహించినట్లు గుర్తుచేశారు. వచ్చే రెండు వారాలు చాలా కీలకమని, దేశాభివృద్ధి కోసం పాటుపడిన బీజేపీని, నరేంద్ర మోదీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. సెక్యులర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలను విభజిస్తోందని, యువతీయువకులు తిప్పికొట్టాలన్నారు.
అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం ఉదయం పరిగి నియోజకవర్గం పూడూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులకు ఓటమి భయం పట్టుకుందన్నారు. యూపీలో బీజేపీ హవాను తట్టుకోలేక కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గం నుంచి కేరళలోని వయానాడ్‌కు పారిపోయారని ఎద్దేవా చేశారు. వయానాడ్ లో రాహుల్‌గాంధీ, చేవెళ్లలో రంజిత్ రెడ్డి ముస్లిం ఓట్లను అడ్డం పెట్టుకొని గెలవాలని చూస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చేవెళ్ల గడ్డపై ఎగిరేది కాషాయ జెండానేనని, హిందువులంతా ఏకమై బీజేపీకి, మోదీకి పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్‌జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.