- తెలంగాణలో బీజేపీ 14 సీట్లు గెలుస్తది
- రాజ్యంగం అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత లెక్క..
- చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
చేవెళ్ల/పరిగి/శంషాబాద్/వికారాబాద్, వెలుగు: అరవై ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రస్పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరో తేల్చుకోలేకపోవడం సిగ్గుచేటని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. పీఎం అభ్యర్థి ఎవరో తెలియకుండా ఎన్నికలకు సిద్ధమైన ఆ పార్టీ జాతీయ నాయకులు సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు(రాజస్థాన్) నారాయణలాల్ పంచలియతో కలిసి గురువారం ఆయన చేవెళ్లలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ఇస్లాం పార్టీనా? లేక ఇండియా పార్టీనా అని దుయ్యబట్టారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని, మూడో స్థానం ఖాయమన్నారు. మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారంటూ, రాజ్యాంగాన్ని మారుస్తారంటూ కాంగ్రెస్‌నేతలు గోబెల్స్‌ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత లెక్క అని, ఎవరూ మార్చరని చెప్పారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. అలాంటి పార్టీ మాదిగల హక్కులపై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.
ఓబీసీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. పీఎం అభ్యర్థి ఎవరో తెలియని పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం అమేథిని వదిలి వయానాడ్పోయినప్పుడే ఓటమి అంగీకరించారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేతలపై నమ్మకం లేదని, ఈసారి కర్ర కాల్చి వాత పెడతారని తెలిపారు. బీజేపీకి 14 ఎంపీ సీట్లు కట్టబెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఆయన వెంట చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, ఎంపీపీ విజయలక్ష్మి రమణరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి, పాండురంగారెడ్డి, అనంతరెడ్డి, బీర్ల నర్సింహ, పరమేశ్వర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, నరసింహారెడ్డి, వైభవ్‌రెడ్డి, మచ్చేందర్ రెడ్డి ఉన్నారు. పరిగిలో బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
సాయంత్రం కొడంగల్ అమరవీర చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే చేవెళ్ల మండల కేంద్రంలోని షాబాద్చౌరస్తా నుంచి శంకర్పల్లి చౌరస్తా వరకు గురువారం రాత్రి విశ్వేశ్వర్‌రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. తన తండ్రికి మద్దతుగా కొండా విశ్వేశ్వర్ రెడ్ది కుమారుడు విశ్వజిత్ రెడ్ది గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రచారం చేశారు. శంషాబాద్మండలంలో రాజేంద్రనగర్బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి.. విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.