శంషాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకొని రైతుల భూములను రికార్డులోంచి తొలగించి, ఆయా భూములను బడానేతల పేర్లపై మార్చుకున్నారని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఎంపీగా గెలిపిస్తే బహదూర్ గూడ, ఘస్మియా గూడలోని రైతుల పట్టా పాస్ పుస్తకాల సమస్య పరిష్కరానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాదయాత్ర శుక్రవారం శంషాబాద్ లో రెండో రోజు కొనసాగింది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ, ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ప్రజలు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను ఎత్తివేస్తామని చెప్పి ఇప్పటివరకు మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, విద్యుత్ కోతలు, మంచినీటి కొరత ఎన్నో సమస్యలు పెరిగాయని విమర్శించారు. వీటిని పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు. మహేశ్వరం సెగ్మెంట్ లోని నాగారం గ్రామానికి పాదయాత్ర చేరుకుంది. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రజా ఆశీర్వాదయాత్ర కొనసాగించారు.
మోదీని మరోసారి ప్రధానిని చేద్దాం.. సంగీతారెడ్డి
మోదీని మరోసారి ప్రధానిని చేసేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భార్య కొండా సంగీతారెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో శుక్రవారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. వికారాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అందుకు అనుగుణంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని ఆమె చెప్పారు. చేవెళ్ల ప్రజలకు అందుబాటులో ఉండే కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. అనంతరం స్థానిక గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కొండా సంగీతా రెడ్డి వెంటనే బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్, నేతలు, కార్యకర్తలు, కొండా అభిమానులు పాల్గొన్నారు.