విశ్వేశ్వర్​రెడ్డి పేరుతో ఫేక్​ వీడియో.. సీఈఓకు ఫిర్యాదు

విశ్వేశ్వర్​రెడ్డి పేరుతో ఫేక్​ వీడియో.. సీఈఓకు ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: తన భర్త పేరుతో ఫేక్​ వీడియో క్రియేట్​చేసి వైరల్​ చేయడంపై చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భార్య కొండా సంగీతరెడ్డి  సీఈఓ వికాస్​ రాజ్​కు  ఫిర్యాదు చేశారు. విశ్వేశ్వర్ రెడ్డి కమలం పువ్వు గుర్తు ఈవీఎంలో రెండో స్థానంలో ఉండగా.. నాలుగో స్థానంలో ఉన్నట్టు ఫేక్ వీడియో క్రియేట్​చేసి కొందరు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారని తెలిపారు. దీంతో చేవెళ్ల ప్రజలను అయోమయానికి గురి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఈ ఫేక్ ప్రచారానికి తెరలేపిందని ఆమె బీఆర్కే  భవన్ లో సీఈఓకు ఫిర్యాదు ఇచ్చారు. 

సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న తప్పుడు ప్రచారాన్ని వెంటనే అడ్డుకోవాలని, కుట్రకు కారణమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.‌‌ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నకిలీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసలు ప్రచారంలో ఎక్కడా కనిపించలేదని, నిజమైన అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ఈ తతంగం జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థికి అసలు ఎలక్షన్ కమిషన్ నాలుగో స్థానాన్ని కూడా కేటాయించలేదని సంగీత రెడ్డి స్పష్టం చేశారు.